హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ రాష్ట్రస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పార్టీ అధినేత కేసీఆర్ ఎవరి పేరూ ఎత్తకుండానే చెడుగుడు ఆడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. కృష్ణాజలాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దొంగాటను, రెండేండ్ల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను కేసీఆర్ చీల్చి చెండాడారు. ఈ సందర్భంగా ఆయన ఒక్క పొల్లు మాట లేకుండా ప్రతి పదాన్నీ తూటాగా మలిచి పాలక వర్గాలపైనే సంధించారు. తెలంగాణ ప్రజలకు ఏది అవసరమో అదే అంశంపై దృష్టి కేంద్రీకరించి స్పష్టంగా మాట్లాడారు. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజల జీవన్మరణ సమస్య పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి ఒక్క ఇంచు అటు, ఒక్క ఇంచు ఇటు కానీ పక్కకు జరుగకుండా పక్కాగా తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.
ఝూటా మాటలకు ఓటు చేజార్చుకున్న ప్రజలను ఓదార్చేటట్టే ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రజలను ఏమార్చినంత సులువుగా పాలన చేయడం చేతిగాని విఫల నేత పేరు కూడా ప్రస్తావించడానికి కేసీఆర్ ఇష్టపడలేదు. ఇంతకాలం నోరు తెరిస్తే చావు శకునాలు, నెత్తుటి కూతలు కూసిన బేతాళ మాటలను కేసీఆర్ తన గంభీరమైన స్వభావంతోనే సమాధానం చెప్పారు. పరిణతితో కూడిన కేసీఆర్ ప్రసంగం ముందు రెండేండ్ల బూతు కూతలు తేలిపోయాయి. ఇరువురి మాట తీరును ప్రజలు, రాజకీయ పరిశీలకులు పోల్చి చూశారు. ‘ఎంతైనా ఏనుగు ఏనుగే.. శుష్క అరుపులు శుష్క అరుపులే’ అని ప్రజలు నిర్ధారణకు వచ్చారు.