హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమస్యలను త్వరగా పరిష్కరించాలని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కోరారు. ఈ సమావేశాల ఫలితంగా పరిష్కార ప్రక్రియ వేగవంతం అవుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. శనివారం తిరువనంతపురంలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం తకువ వ్యవధిలోనే దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో ఒకటిగా అవతరించిందని తెలిపారు. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 2014-15లో 4.1 శాతం ఉంటే 2021-22లో 4.9 శాతానికి చేరి జాతీయ జీడీపీకి మెరుగైన తోడ్పాటు అందించిందని అన్నారు. తెలంగాణ ఎన్నో వినూత్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో ముందున్నదని హోంమంత్రి పేర్కొన్నారు.
నీటిపారుదల రంగంలో అభివృద్ధితోపాటు పెట్టుబడిదారులకు అత్యంత స్నేహపూర్వక ఉండే టీఎస్-ఐపాస్ వ్యవస్థను ప్రవేశపెట్టిందని తెలిపారు. 24 గంటలపాటు నిరంతరంగంగా నాణ్యమైన విద్యుత్తును అందించడం, రైతులకు పెట్టుబడి మద్దతు (రైతు బంధు) సహా ఎన్నో కార్యక్రమాలతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని, ఇది హర్షణీయ విషయమని చెప్పారు.
కోవిడ్ మహమ్మారి ప్రతికూల ప్రభావం ఉన్నా, తెలంగాణ జీఎస్డీపీ ప్రస్తుత ధరల ప్రకారం 2020-21లో 1.21% సానుకూల వృద్ధిని నమోదు చేయడాన్ని బట్టి ఇది స్పష్టమవుతున్నదని వివరించారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు, అద్భుతమైన ఏర్పాట్లు చేసిన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశంలో నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ బీ హరిరామ్, ట్రాన్స్‌కో జేఎండీ సీ శ్రీనివాసరావు, అడిషనల్ డీజీ స్వాతిలక్రా తదితరులు పాల్గొన్నారు.