రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్) భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు ఉత్తర భాగం పనులను టెండర్ల దాకా తీసుకొచ్చినా ఎటూతేలక, భూసేకరణ కొలిక్కిరాక ఏడాది నుంచి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ముఖ్యంగా భూములు కోల్పోతున్న రైతులు బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్‌కు రేవంత్ సర్కార్ స్పందించకపోగా, పరిహారం పెంచేది లేదని దేశమంతా ఒకే విధానం అంటూ ఎన్హెచ్ఏఐ తెగేసి చెప్తుండటంతో ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం కింద రూ.15,627 కోట్ల అంచనా వ్యయంతో సంగారెడ్డి నుంచి నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్- యాదగిరిగుట్ట-చౌటుప్పల్ వరకు సుమారు 160 కిలోమీటర్ల మేర హ్యామ్ విధానంలో ఆరు లేన్ల రహదారిని ఐదు ప్యాకేజీల్లో నిర్మించాలని నిర్ణయించారు. డిసెంబర్ 2024లో ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలిచింది. మొదలు నాలుగు లేన్ల ప్రతిపాదనే ఉండగా, టెండర్లు పిలిచిన తర్వాత భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా 6 లేన్లకు పెంచారు. డిజైన్ మారడంతో మళ్లీ టెండర్లు పిలువాల్సి ఏర్పడింది. ఏడాది దాటినా టెండర్లు తెరవడం కానీ, రద్దు చేసి మరోసారి పిలువకపోవడంతో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నది పరిస్థితి.
రహదారి నిర్మాణంలో భూసేకరణ పెద్ద సమస్యలా మారింది. అత్యంత కీలకమైన ఈ ప్రక్రియ ఎటూతేలకపోవడం వల్లే ప్రాజెక్టు నిలిచిపోవడానికి ప్రధాన కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి 1933.2 హెక్టార్ల భూమి అవసరం కాగా, 46.3 హెక్టార్లు మాత్రమే ఎన్హెచ్ఏఐ ఆధీనంలోకి వచ్చింది. సేకరించాల్సిన భూములకు 3ఏ నోటిఫికేషన్ (ప్రాథమిక నోటిఫికేషన్) జారీ చేసినా, నష్టపరిహారం చెల్లించి భూముల స్వాధీనానికి ఉద్దేశించిన 3హెచ్ నోటిఫికేషన్ మాత్రం ఇప్పటివరకు 4శాతం మాత్రమే పూర్తికావడం గమనార్హం.
ట్రిపుల్ఆర్ ప్రతిపాదిత గ్రామాల్లో ఎకరా భూమి ధర బహిరంగ మార్కెట్లో సగటున రూ.50 లక్షల వరకు పలుకుతున్నది. కానీ ఎన్హెచ్ఏఐ మాత్రం కేవలం రూ.6లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 20లక్షల వరకు మాత్రమే ఇవ్వాలని చూస్తున్నది. భూములు కోల్పోతున్న రైతులు మాత్రం బహిరంగ మార్కెట్ ధర చెల్లిస్తేనే తాము భూములు వదులుకుంటామని భీష్మించారు. తమ బతుకుదెరువు ఆ భూములతోనే ముడిపడి ఉన్నదని, అందుకే ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారంతో తాము మరోచోట భూములు కొనుగోలు చేసుకుంటామని, లేనిపక్షంలో తమకు భూమికి బదులు మరోచోట భూమి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. భూసేకరణకు అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్హెచ్ఏఐ చెరిసగం భరించాల్సి ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో నిర్ణీత నష్టపరిహారం కన్నా ఒక్క రూపాయి కూడా పెంచేది లేదని ఎన్హెచ్ఏఐ ఇప్పటికే పలు దఫాలు స్పష్టంచేసింది. అదనంగా నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం పెంచే విషయంలో దాటవేత ధోరణి అవలంబిస్తుండడంతో భూసేకరణ వ్యవహారం కొలిక్కిరావడం లేదు.
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టులపై గతంలో అధ్యయనం నిర్వహించిన పార్లమెంటరీ కమిటీ, ప్రాజెక్టులు నిలిచిపోవడానికి భూసేకరణ పూర్తికాకముందే పనులు చేపట్టడం, కోర్టు కేసులు ప్రధాన కారణమని తేల్చింది. ఎక్కడా 100 శాతం భూసేకరణ పూర్తికాకుండా ప్రాజెక్టులు చేపట్టరాదని సూచించింది. ప్రాజెక్టులు మధ్య లో నిలిచిపోవడం వల్ల పెట్టిన పెట్టుబడి వృథా కావడమే కాకుండా అం చనా వ్యయం భారీగా పెరుగుతుందని, దీనివల్ల కొత్త తలనొప్పులు తలెత్తుతాయని తేల్చింది. ట్రిపుల్ ఆర్ పనులు చేపట్టే విషయంలో ఎన్హెచ్ఏఐ తొందర పడటంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రా మీణ రోడ్ల అభివృద్ధి పనులు కూడా చేపట్టలేక హ్యామ్ విధానం చేపట్టాల ని నిర్ణయించిన సర్కార్, బాధిత రైతులకు నష్టపరిహారం పెంచే పరిస్థితిలో లేదు. ఎన్హెచ్ఏఐ సైతం దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అనుసరిస్తున్నందున ట్రిపుల్ ఆర్ కోసం నిబంధనలను మార్చుకునే అవకా శం లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు ఇప్పట్లో ముందుకు సాగే అవకాశం లేదని అధికారవర్గాలు స్పష్టంచేస్తున్నాయి.