హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధి, దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలు, టెక్నాలజీ వినియోగం అత్యంత అద్భుతమని పార్లమెంటరీ కమిటీ ప్రశంసల జల్లు కురిపించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ గవర్నెన్స్ సేవలు, ఇన్నొవేషన్ రంగంలో ఇంక్యుబేటర్ల ఏర్పాటు, టీ ఫైబర్ ప్రాజెక్టులను ప్రత్యేకంగా కొనియాడింది. రెండు రోజులుగా హైదరాబాద్‌లో పర్యటిస్తున్న శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ .. తెలంగాణలో ఐటీ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై అధ్యయనం చేస్తున్నది. ఈ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్‌లో హైదరాబాద్ ఐటీ రంగంలో మరిన్ని అద్భుతాలను సాధిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఐటీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆదర్శవంతమైన కార్యక్రమాలను.. అన్ని రాష్ర్టాల్లో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇందులో భాగంగా ఐటీ రంగంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టులు, విజన్‌పై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు, స్థాయి సంఘానికి బుధవారం నివేదిక అందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన టీఎస్ఐపాస్, ఇతర విధానపరమైన నిర్ణయాలు, ఐటీ పరిశ్రమతో కలసి ప్రభుత్వం పని చేయడం వల్ల రాష్ర్టానికి అనేక పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద టెక్ కంపెనీలకు సంబంధించిన క్యాంపస్‌లు అమెరికా తర్వాత హైదరాబాలోనే ఉన్నాయని చెప్పారు. ప్రతి రంగానికి ఐటీ సేవలు అందించామని, ఇందుకోసం ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందుకు ఉదాహరణగా టీ హబ్, వీ హబ్, అగ్రి హబ్, బీ హబ్, రిచ్, టీ వర్ ఇంక్యుబేషన్ కేంద్రాల గురించి వివరించారు. డిజిటల్ ఎకానమీ, పరిపాలనలో ఐటీ వినియోగంపై పార్లమెంటరీ సంఘం ఆసక్తిగా ఆడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ వివరంగా సమాధానమిచ్చారు. మొబైల్ ఆధారిత ప్రభుత్వ సేవలు, కాంటాక్ట్ లెస్ గవర్నెన్స్ దిశగా చేపడుతున్న కార్యక్రమాలు, టీ వాలెట్ సాధించిన మైలురాళ్లను తెలిపారు. దేశంలో ఎకడా లేనివిధంగా ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ఉద్దేశంతో చేపట్టిన టీ ఫైబర్ ప్రాజెక్టు గురించి వివరించారు. టీ ఫైబర్ ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా కేంద్రం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా సీఎం కేసీఆర్ విజన్ మేరకు ఏర్పాటుచేసిన ధరణికి వినియోగిస్తున్న టెక్నాలజీ, దాని పనితీరు గురించి చెప్పారు. తెలంగాణకు ప్రత్యేకంగా సహాయం అందించడంలో కేంద్రం ప్రభుత్వం మరింత చొరవ చూపేలా సిఫార్సు చేయాలని ఈ సందర్భంగా పార్లమెంటరీ కమిటీని మంత్రి కేటీఆర్ కోరారు. ముఖ్యంగా ఐటీఐఆర్ వంటి ప్రాజెక్టును లేదా అదనపు ప్రోత్సాహాన్ని వెంటనే ప్రకటించే అంశంలో కమిటీ సహకరించాలని కోరారు.
టీ-వ్యాలెట్ : డిజిటల్ పేమెంట్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో ఫోన్ ఉన్నా లేకపోయినా ఆన్లైన్లో చెల్లింపులు చేసేలా ‘టీ-వ్యాలెట్’ను రూపొందించారు. 2017 జూన్ ఒకటిన జరిగిన ఈ ఆవిష్కరణకు 2018లో సీఎస్ఐ ‘నిహిలెంట్ ఈ-గవర్నెన్స్’ అవార్డు దక్కింది. టీ-వ్యాలెట్‌ను స్మార్ట్‌ఫోన్, ఫీచర్ ఫోన్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లో వినియోగించేలా తీర్చిదిద్దారు. ఫోన్ లేనివారు, ఫీచర్ ఫోన్వాడేవారు సమీపంలోని మీసేవ సెంటర్ లేదా రేషన్ దుకాణానికి వెళ్లి టీ-వ్యాలెట్ అకౌంట్‌ను తెరువొచ్చు. అందులో డబ్బులువేసి చెల్లింపులు చేయొచ్చు. ప్రభుత్వం సైతం టీ-వ్యాలెట్ ద్వారా చెల్లింపులు చేస్తున్నది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా 5 జిల్లాల్లోని విద్యార్థులకు స్కాలర్షిప్లను టీ-వ్యాలెట్ ద్వారా పంపుతున్నారు. 20 వేల మందికి రూ.14 కోట్లు పంపిణీ చేశారు.
ధరణి: భూ లావాదేవీల్లో పారదర్శకత పెంచుతూ, ట్యాంపరింగ్ చేయడానికి వీలుకాని రెవెన్యూ రికార్డులను సృష్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌తో భూ హక్కుల బదిలీ బ్యాంకు లావాదేవీల మాదిరిగా క్షణాల్లో జరిగిపోతున్నది. ఆన్లైన్ స్లాట్ బుకింగ్, ఆటోమెటిక్ మార్కెట్ వాల్యూ క్యాలిక్యులేషన్, బయోమెట్రిక్ అథెంటిఫికేషన్, ఈ-పీపీబీ వంటి ప్రక్రియల ఫలితంగా అత్యంత పారదర్శకంగా లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఐటీశాఖ రాష్ట్రంలోని 580 మండల కేంద్రాల్లో కంప్యూటర్, స్కానర్, ప్రింటర్, బయోమెట్రిక్ డివైజ్, కెమెరా, ఇంటర్నెట్ కనెక్షన్ వంటి సదుపాయాలు కల్పించింది. ధరణి ద్వారా ఇప్పటివరకు 8 లక్షలకుపైగా లావాదేవీలు జరిగాయి.
మీసేవ
ప్రతి వెయ్యి మంది జనాభాకు చేసిన మీసేవ లావాదేవీల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2014 జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటివరకు తెలంగాణలో ప్రతి వెయ్యి మంది జనాభాకు 1,73,322 లావాదేవీలు జరిగాయి. మరిన్ని సేవలతో 2016-17లో మీసేవ 2.0 అందుబాటులోకి వచ్చింది.