Mandala Raju Reddy | జయశంకర్ భూపాలపల్లి, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఉప్పందించిన మందల రాజురెడ్డి అకస్మాత్తుగా కనుమరుగైపోయాడు. సాధించుకున్న స్వరాష్ర్టాన్ని చూడలేకపోయాడు. ఎక్కడో ఓ చోట ఉన్నాడనే ఆశతో తల్లిదండ్రులు కాలం గడుపుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు పన్నేండేళ్లుగా కనిపించకపోయేసరికి వృద్ధ్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఏడ్చి ఏడ్చి కళ్లలో నీళ్లు ఇంకిపోయాయి. కాటికి కాలు చాచిన ఆ వృద్ధులు దిక్కులేనివారిగా మిగిలిపోయారు. కూతురికి పెళ్లి చేసి పంపగా .. ఆమే ఆ పండుటాకులను చూసుకుంటున్నది. పన్నేండేళ్లుగా ఆ కూతురు తల్లిదండ్రులను వెంటపెట్టుకుని పోలీస్ స్టేషన్లు, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నది. 2017లో భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏడేళ్లు అవుతున్నా రాజురెడ్డి ఆచూకీ లభించలేదు. రాజురెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాడని, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన పోరాటాల్లో పాల్గొన్నాడని, అనంతరం అతను కనిపించకుండా పోయాడని విచారణ జరిపిన తహసీల్దార్, ఆర్డీవో జిల్లా కలెక్టర్, ఎస్పీకి నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం రాజురెడ్డి తల్దిదండ్రులు అనారోగ్యంతో బాధ పడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తూ చేయూత కోసం ఎదురు చూస్తున్నారు.
ఉద్యమం నుంచే కనుమరుగు
మందల రాజురెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో పదో తరగతి, హనుమకొండలో ఇంటర్, హైదరాబాద్‌లోని ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ప్రైవేటు కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఉస్మానియా కళాశాలలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఉద్యమానికి అండగా నిలిచాడు. 2012 నుంచి రాజురెడ్డి ఆచూకీ కరువైంది. రాజురెడ్డి కూతురు మమత తల్లిదండ్రులతో కలిసి 2017 జూన్ 20న భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భూపాలపల్లి పోలీసులు ఈ కేసును ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అక్కడి పోలీసులు విచారణ జరిపి రాజురెడ్డి ఆచూకీ లభించడం లేదని 2021 నవంబర్ 10న సర్టిఫికెట్ ఇచ్చారు.
ఆర్డీవో నివేదిక ఇచ్చినా….
రాజురెడ్డి అదృశ్యంపై తల్లిదండ్రులు మందల చిన్న సమ్మిరెడ్డి, సుమతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూపాలపల్లి తహసీల్దార్ ఇక్బాల్ విచారణ జరిపి ఆర్డీవో శ్రీనివాస్‌కు నివేదిక ఇచ్చారు. అనంతరం విచారణ జరిపిన ఆర్డీవో 2012 జూన్ 6 నుంచి రాజురెడ్డి కనిపించడం లేదని, తల్లిదండ్రులు కొడుకు జాడ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్‌కు, ఎస్పీ సురేందర్‌రెడ్డికి నివేదిక సమర్పించారు. ఇదే విషయమై కలెక్టర్ భవేశ్‌మిశ్రా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. కొడుకు పన్నెండేళ్లుగా కనిపించడం లేదని, ఉద్యమంలో మృతి చెందాడా.. లేక ఏమయ్యాడో ఆచూకీ చెప్పాలని తల్లిదండ్రులు కోరగా ఎలాంటి సమాచారం లేదని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు లేఖ ఇచ్చారు. కొడుకు డెత్ సర్టిఫికెట్ అయినా ఇవ్వాలని కోరగా భూపాలపల్లి పోలీసులు ఉస్మానియా పోలీసులపైనా, ఉస్మానియా పోలీసులు భూపాలపల్లి పోలీసులపై కేసును నెట్టేస్తూ జాప్యం చేస్తున్నారని రాజురెడ్డి తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
ప్రత్యేక చొరవ చూపిన బీఆర్ఎస్
మందల రాజురెడ్డి ఉద్యమ కాలంలో మిస్సింగ్ విషయమై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. రాజురెడ్డి ఆచూకీ విషయమై నాటి మంత్రి కేటీఆర్ జిల్లా ఉన్నతాధికారులను నివేదిక కోసం ఆదేశించారు. తెలంగాణ అమరవీరులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 10 లక్షలతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించిన విషయం తెలిసిందే. రాజురెడ్డికి డెత్ సర్టిఫికెట్ లేకపోవడంతో కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందలేదు. ఒక వ్యక్తి ఏడేళ్లు మిస్సింగ్‌లో ఉంటే మృతి చెందినట్టుగా భావించి డెత్ సర్టిఫికెట్ ఇవ్వవచ్చని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని, ఈక్రమంలో రాజురెడ్డి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసుకు ఏడేళ్లు కాగా.. డెత్ సర్టిఫికెట్ ఇవ్వొచ్చని న్యాయవాదులు చెబుతున్నారు. ఆర్డీవో విచారణలో సైతం రాజురెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అదృశ్యమయ్యాడని నివేదిక ఇచ్చారని , డెత్ సర్టిఫికెట్ ఇచ్చి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వొవచ్చని వారు సూచిస్తున్నారు.
మాకు దిక్కెవ్వరు..?
12 ఏళ్లుగా కొడుకు కోసం కళ్లలో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నం. రాజురెడ్డిని టీవీల్లో చూసుకునేటోళ్లం. తెలంగాణ కోసం కోట్లాడే వాళ్లలో నా కొడుకు ఉండే. ఎన్నిసార్లు వద్దన్నా ఇనలే. మాకు ఒక కొడుకు, ఒక కూతురు. 12 ఏళ్లు దాటింది కొడుకును చూడక. బతికున్నడా.. చనిపోయిండో తెలువదు. బిడ్డను వెంట పెట్టుకుని హైదరాబాద్ అంతా తిరిగినం. మా ఊరిలో ఉన్న వాసుదేవరెడ్డితో బీఆర్ఎస్ నేత కేటీఆర్, గత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని కలిసినం. డెత్ సర్టిఫికెట్ ఇప్పించి న్యాయం చేస్తామని చెప్పారు. అంతలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది. మా ఆయనకు పక్షవాతం, నాకు కీళ్లవాతం. ఆర్థికంగా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. అప్పు చేసి బిడ్డ పెళ్లి చేసినం. అద్దె ఇంట్లో బతుకుతున్నాం. ప్రభుత్వం న్యాయం చేయాలి.
– మందల సుమతి. రాజురెడ్డి తల్లి