గంగాధర, మే 26 : బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించి పేద విద్యార్థులను ఆదుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను గంగాధరలో కలిసి మొరపెట్టుకున్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పాఠశాల కింద స్థానికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించేలా ఏర్పాటుచేసిందని గుర్తుచేశారు.
ఇందులో భాగంగా గంగాధరలోని వివేకానంద పాఠశాలలో 200 మందికి ఉచితంగా విద్యనందిస్తుండగా అవసరమైన పుస్తకాలు, యూనిఫాంలు, హాస్టల్ వసతికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్నదని చెప్పారు. రెండేండ్లుగా ఈ బిల్లులను చెల్లించకపోవడంతో తల్లిదండ్రులు చెల్లించాలని పాఠశాల యాజమాన్యం చెబుతున్నదని వివరించారు. ఎమ్మెల్యే స్పందించి జూన్ పదో తేదీలోగా బిల్లులు చెల్లించేలా చూస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.