TSPSC | హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): సర్కారీ కొలువులకు ఇక సమాంతర (హారిజంటల్) రిజర్వేషన్లు వర్తింపజేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో ఆ మేరకు నిర్ణయం తీసుకొన్నది. ఇప్పటివరకూ రాష్ట్రంలో వర్టికల్ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఉద్యోగాల భర్తీలో సమాంతర రిజర్వేషన్లు వర్తింపజేయాలని గతంలో రాజేష్‌కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఇటీవలే తెలంగాణ హైకోర్టు సైతం దీనిని సమర్థించింది. గ్రూప్-1లో సమాంతర మహిళా రిజర్వేషన్లు వర్తింపజేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్-1తోపాటు మరో మూడు కేసుల్లోనూ సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు సూచనల నేపథ్యంలో టీఎస్పీఎస్సీ నిర్వహించే అన్ని పరీక్షలకు సమాంతర రిజర్వేషన్లు వర్తింపజేయాలని కమిషన్ నిర్ణయించింది. నిరుడు డిసెంబర్ తర్వాత టీఎస్పీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షలకు సమాంతర రిజర్వేషన్లు వర్తింపజేయనున్నట్టు కమిషన్ వెల్లడించింది. సమాంతర రిజర్వేషన్లకు లోబడే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు సైతం జరుగనున్నాయి.
సమాంతర రిజర్వేషన్లు అంటే?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అర్హులైన ప్రతి ఒకరికీ ఉద్యోగాలు దక్కాలని, అందరికీ న్యాయం జరుగాలనే ఉద్దేశంతో సర్కారు అనేక సంసరణలు చేసింది. ఉద్యోగాల భర్తీకి రోస్టర్ పాయింట్‌ను మళ్లీ ఒకటి నుంచి ప్రారంభించింది. రోస్టర్ పాయింట్ల పట్టిక 1-100 పాయింట్లను పరిగణనలోకి తీసుకొంటే ఓపెన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు కేటాయించిన పోస్టుల్లో మహిళలకు 33 (1/3) శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. 2018లో జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ తర్వాత మళ్లీ 1 నుంచి రిజర్వు చేయడం ప్రారంభమైంది. ఉద్యోగాల భర్తీలో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీల్లో రిజర్వ్ చేసిన పాయింట్లలో మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయి.
సమాంతర రిజర్వేషన్లన్లను అనుసరించి… రోస్టర్ పాయింట్ల ప్రకారం మహిళలకు ఎకువ పోస్టులు వస్తే అవి వారికే ఉంటాయి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల క్యాటగిరీల్లోని మహిళలు జనరల్ కోటాలో మెరిట్లో ఉద్యోగం సాధించారనుకొంటే.. ఆ రిజర్వ్డ్ క్యాటగిరీలో మహిళల కోసం ప్రత్యేకంగా పేరొన్న పోస్టులను డీ రిజర్వ్ చేస్తారు. ఉదాహరణకు.. ఒక సామాజికవర్గంలో 1 నుంచి 10 వరకు పది పోస్టులు ఉన్నాయి. అందులో 8, 9, 10 పోస్టులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. అందులో మొదటి 3 ఉద్యోగాలను మెరిట్ ప్రకారం మహిళలే సాధించారు. అలాంటప్పుడు.. మొదటి 3 పోస్టులను మహిళలకు కేటాయించి.. 8,9,10 స్థానాల్లో మహిళా రిజర్వేషన్లను డీ రిజర్వ్ చేస్తారు. ఆ 3 పోస్టులను అదే సామాజికవర్గంలో జనరల్ పోస్టులు చేస్తారు. వాటికి మహిళలు, పురుషులు సమానంగా పోటీ పడవచ్చు. పది ఉద్యోగాల్లో ఒకవేళ తొలి ఏడింటిలో 2 పోస్టుల్లో మహిళలు మెరిట్ సాధిస్తే.. మహిళలకు కేటాయించిన మిగిలిన 3 పోస్టుల్లో రెండు డీ రిజర్వ్ చేస్తారు.