నమస్తే నెట్వర్క్, మే 1 : పలు జిల్లాల్లో బుధవారం రాత్రి, గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. కల్లాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోగా.. చేతికొచ్చిన బొప్పాయి తోటలు విరిగిపోయాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం సూర్యాతండాలో రైతు వాంకుడోతు బాలకు చెందిన పది ఎకరాల బొప్పాయి తోట నేలకొరిగింది. కారేపల్లి క్రాస్రోడ్లో భూక్యా శంకర్ ఐదెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేసిన బొప్పాయి తోట నేలకొరిగింది. రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్టు రైతు శంకర్ వాపోయాడు. తిరుమలాయపాలెం మండలం బచ్చోడు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యపు రాసులు తడిసిముద్దయ్యాయి.
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారంలో కోళ్లఫాం పూర్తిగా నేల మట్టమైంది. గుండ్లసోమారంలో పది రేకుల ఇండ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. భీమారం మండలం దాంపూర్లో కందుల లింగయ్యకు చెందిన మామిడితోటలో కాయలు రాలిపడి నష్టంవాటిల్లింది. రెడ్డిపల్లి, ధర్మారం, కాజీపల్లి, భీమారంలోనూ మామిడి పంటకు నష్టం వాటిల్లింది. దాంపూర్లో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రెడ్డిపల్లి, వెల్లపల్లి, బూర్గుపల్లి పరిధిలో మామిడి తోటలు, వరిపొలాలను హార్టికల్చర్ అధికారి కల్యాణి, మండల వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ పరిశీలించారు.
చెన్నూర్ మండలంలో సుద్దాల, లంబాడిపల్లె, కన్నెపల్లి, సంకారం, బుద్ధారం, అంగ్రాజ్పల్లి, కిష్టంపేట, లింగంపల్లి గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. అధికారులు స్పందించి నష్ట పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వరి పంట నేలమట్టం కాగా, మామిడికాయలు రాలిపోయాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. చెట్లు కూలగా, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అక్కడక్కడా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు తడిసి ముద్దయ్యాయి.