మహబూబ్‌నగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో శోకాన్ని కూడా గొంతు దాటి బయటకు వ్యక్తం చేయలేని తీవ్ర విషాదం నెలకొంది. పోలీసు పహారా మధ్య ఆవరించిన నిశ్శబ్దంలో క్షణక్షణం.. భయం భయంగా గడుస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామంలో ఎవరు ఏం మాట్లాడితే.. ఎవరికి ఏం జరుగుతుందో.. అనే భయం స్థానికుల్లో నెలకొన్నది. 13 ఏండ్లు గ్రామ సర్పంచ్‌గా సేవలందించినా అధికార బలాన్ని ఎదిరించడానికి బలం సరిపోక, అవమానాలు, అరాచాకాలను తట్టుకోలేక పాంకుంట్ల సాయిరెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ కుటుంబాన్ని ఓదార్చేందుకు, సాయిరెడ్డిని కడసారి చూసేందుకు కూడా జనం భయపడుతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సోదరుల ఆగడాలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్‌నోట్ రాసిన సాయిరెడ్డి భౌతికకాయం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలోనే ఉన్నది. సాయిరెడ్డి పెద్ద కొడుకు వెంకట్‌రెడ్డి అమెరికాలోని తన బిడ్డల దగ్గరకు వెళ్లడంతో ఆయన రాకకోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఆదివారం రాత్రి వెంకట్‌రెడ్డి హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తున్నది. సాయిరెడ్డిని భౌతికకాయాన్ని చూసేందుకు అతడి సంతానం, బంధువులు తప్ప.. సానుభూతి తెలిపేందుకు గ్రామస్థులు పెద్దగా ఎవరూ ముందుకు రావడంలేదు. వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఎలాంటి ముచ్చట కనిపించడం లేదు. సాయిరెడ్డి ఆత్మహత్య వార్త శుక్రవారం సాయంత్రం 6 గంటలకే అందరికీ తెలిసినా.. గ్రామస్థులు చాలా మందికి రాత్రి వరకు తెలియలేదు. కల్వకుర్తికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుని ఎవరేమి మాట్లాడుతున్నారో నిఘా ఉంచారు. పోలీసు ఉన్నతాధికారుల నేతృత్వంలో భారీగా బలగాలు మోహరించాయి.