Pamkuntla Sai Reddy | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి సోదరుల అరాచకాలను ప్రశ్నించడమే అతడు చేసిన తప్పయింది! వాళ్లు చేస్తున్న దాష్టీకాలపై ఇతరులతో చర్చించడమే అతడి పాలిట శాపమైంది. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఆగడాలను బయటపెట్టాడన్న కక్షతో రేవంత్ బ్రదర్స్ సాగించిన వేధింపులకు ఓ నిండు ప్రాణం బలైంది. సొంత ఇంటికి వెళ్లే దారిని కూడా మూసి.. తనపై ఎనుముల సోదరులు నింద వేశారన్న మనస్తాపంతో ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి (85) కల్వకుర్తిలో శుక్రవారం సాయంత్రం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సీఎం రేవంత్ బ్రదర్స్ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖ రాశాడు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో లగచర్ల ఘటన నుంచి ప్రజలు తేరుకోకముందే ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి స్వగ్రామంలో సీఎం సోదరుల వేధింపులతో ఓ మాజీ సర్పంచ్ బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపింది.
ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తిత్వం
సాయిరెడ్డికి గ్రామంలో మంచిమనిషిగా పేరున్నది. ఆయన పార్టీలకు అతీతంగా ఉంటారని, నిజాయతీపరుడని, ఉన్నది ఉన్నట్టు కుండబద్దలుకొట్టి మాట్లాడే వ్యక్తిత్వం తనదని ఊరివాళ్లు చెప్తున్నారు. గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే నేరుగా హెచ్చరించేవాడని, రేవంత్‌రెడ్డి కుటుంబ అరాచకాలపైనా పలుమార్లు నిలదీశాడని, ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడని తెలిసింది. దీనిపై కక్షపెట్టుకొని రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు తన ఇంటి ముందు పశువుల దవాఖాన, కంపౌండ్ వాల్ కడుతున్నామని చెప్పి ఇంటికి వెళ్లేందుకు కనీసం దారి కూడా లేకుండా గోడ నిర్మించారని, నిందలు వేశారని ఈ బాధలు భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సాయిరెడ్డి లేఖలో పేర్కొన్నాడు.
దారి కోసం వేడుకున్నా..
తన ఇంటికి వెళ్లేందుకు కనీసం నడకదారి అయినా ఇవ్వాలని సాయిరెడ్డి గ్రామ కార్యదర్శిని, రేవంత్‌రెడ్డి అనుచరులను వేడుకున్నాడు. సాయిరెడ్డిని చూసి రేవంత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి అనుచరులు వెకిలిగా మాట్లాడారని, తగిన శాస్తి చేస్తామంటూ బెదిరింపులకు దిగారని తెలిసింది. ‘మా ఇంటికి వెళ్లేందుకు దారి ఇవ్వకుంటే నాకు చావే దిక్కు’ అని రేవంత్‌రెడ్డి అనుచరుడికి సాయిరెడ్డి చెప్పగా ‘నువ్వు చస్తే చావు’ అంటూ దురుసుగా ప్రవర్తించినట్టు గ్రామంలో చర్చ నడుస్తున్నది. ఇటీవల హైదరాబాద్ నుంచి కొండారెడ్డిపల్లికి వెళ్లిన మీడియా ప్రతినిధులతో అసభ్యంగా ప్రవర్తించి, వాళ్ల ఫోన్లను లాక్కున్నది ఆ అనుచరుడేనని, సాయిరెడ్డితో కూడా దురుసుగా వ్యవహరించింది అతడేనని తెలిసింది.
ఉదయమే ఆత్మహత్యకు ప్రయత్నించి..
శుక్రవారం ఉదయం 7గంటలకు పురుగుల మందు డబ్బా తీసుకొని గదిలోకి వెళ్లి సాయిరెడ్డి తలుపులు మూసుకున్నాడు. కుటుంబసభ్యులు ఎంత పిలిచినా బయటకు రాకపోవడంతో గ్రామస్తులతో కలిసి తలుపులు బద్దలు కొట్టి బయటకు తీసుకొచ్చారు. మాజీ సర్పంచ్ ఆత్మహత్యాప్రయత్నం గ్రామంలో పాకడం, సూసైడ్ నోట్ రాసి పెట్టుకున్నాడని తెలియడంతో కలకలం రేగింది. వెంటనే సమాచారం అంది వంగూరు పోలీసులు హుటాహుటిన చేరుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి బలవంతంగా సూసైడ్ నోటును తీసుకెళ్లిపోయారు. అప్పటికే కొంతమంది ఈ సూసైడ్ నోట్‌ను సెల్ఫోన్లో ఫొటో తీసి పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కల్వకుర్తి వెళ్లొస్తానని చెప్పి..
ఉదయం జరిగిన ఘటన తర్వాత అంతా సద్దుమణిగింది అనుకున్న తరుణంలో మధ్యాహ్నం సాయిరెడ్డి కల్వకుర్తికి వెళ్లొస్తానని చెప్పి ఇంట్లోవారిని నమ్మించి బయలుదేరాడు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఓ పెస్టిసైడ్ షాపులో మళ్లీ పురుగుల మందు కావాలని అడగగా అనుమానం వచ్చిన వ్యాపారి ఇవ్వలేదు. ఓ మెడికల్ షాప్‌కు వెళ్లి నిద్ర మాత్రలు కావాలని అడిగాడు. చివరకు ఓ దుకాణంలో పురుగుల మందు డబ్బా కొనుకున్నాడు. కల్వకుర్తి బస్టాండ్ సమీపంలోని రఘుపతిపేట రహదారిలో బండరాయిపై కూర్చుని పురుగుల మందు తాగి కుప్పకూలాడు. అటుగా వెళ్తున్న కొందరు గమనించి ఎవరని ఆరా తీయగా కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ అని తెలియడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
కాంగ్రెస్‌లో క్రియాశీల పాత్ర
కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్ర పోషించిన సాయిరెడ్డి కొండారెడ్డిపల్లి గ్రామానికి రెండు దఫాల్లో 13 ఏండ్లపాటు సర్పంచ్‌గా వ్యవహరించారు. పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడ్డారు. గ్రామాభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేశారన్న పేరు సాయిరెడ్డికి ఉన్నది. అతడికి భార్య రామలక్ష్మి, ఇద్దరు కొడుకులు మాధవరెడ్డి, వెంకటరెడ్డి, కూతురు సులోచన ఉన్నారు. కాగా వెంకటరెడ్డి వారం క్రితమే అమెరికా వెళ్లగా అతడు వచ్చాక సాయిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
నాలుగు రోజులుగా తీవ్రమైన వేధింపులు
ఆగస్టు నుంచి సాయిరెడ్డిని రేవంత్ సోదరులు టార్గెట్ చేసినట్టు తెలిసింది. అంతకు ముందు నుంచే ఇబ్బందులు పెట్టాలని చూసినా ఆగస్టు నుంచే వేధింపులు తీవ్రమైనట్టు తెలుస్తున్నది. సాయిరెడ్డి తన ఇంటిని 40 ఏండ్ల క్రితం నిర్మించుకున్నాడు. ఇంటి సమీపంలో పాడుబడ్డ బాయి బొంద ఉంటే సొంత ఖర్చులతో పూడ్చి దారిగా మార్చుకున్నాడు. ఇక్కడ ఇప్పుడు పశువుల దవాఖాన, కాంపౌండ్ వాల్ కట్టాలని రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు పనులు మొదలుపెట్టారు. నాలుగు రోజుల నుంచి సాయిరెడ్డి ఇంటికి వెళ్లే దారి మొత్తాన్ని మూసివేసే దిశగా నిర్మాణ పనులు చేపట్టారు. ఈ విషయంపై వంగూరు ఎస్ఐకి సాయిరెడ్డి చెప్పినా పట్టించుకోలేదని తెలిసింది.
జేసీబీకి అడ్డంపడి.. అవమానభారంతో
కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్‌కు, ప్రైవేట్ సైన్యానికి గురువారం ఘర్షణ జరిగింది. కాంపౌండ్ వాల్ పనులు జరుగుతుండగా సాయిరెడ్డి వెళ్లి జేసీబీకి అడ్డంపడ్డాడు. అక్కడే ఉన్న పంచాయతీ సిబ్బంది, వంగూరు పోలీసులు, రేవంత్ బ్రదర్స్ అనుచరులు సాయిరెడ్డిని లాగేసి బెదిరించి ఇంటికి పంపించారు. రెండుసార్లు గ్రామానికి సర్పంచ్‌గా ఉండి తన ఇంటికి అడ్డంగా గోడ కడుతున్నా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానంటూ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గోడ కట్టవద్దని ఎంత అడ్డుకున్నా దౌర్జన్యంగా కట్టడంతో తీవ్ర ఆవేదనకు గురైన సాయిరెడ్డి ఇంటికి వెళ్లి సూసైడ్ నోట్ రాసుకున్నాడు.
బెదిరించి కొట్టి.. సావుదాకా తెచ్చిండ్రు
మా ఇంటికి పోకుండా గోడ అడ్డం కడుతుంటే మా నాన్న చాలా బాధపడ్డడు. ఊర్లో గ్రామ పంచాయతీ వాళ్లు వంగూరు పోలీసులను తీసుకొచ్చి ఆయనను కొట్టిండ్రు. ఇన్ని రోజులు బెదిరించి ఇప్పుడు సచ్చేదాకా తెచ్చిండ్రు. మా నాన్నను కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బెదిరించిండ్రు. సూసైడ్ నోట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఏమో.. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండ్రి.. వాళ్లను ఎదిరించి మేం బతకలేం.
-మాధవరెడ్డి (సాయిరెడ్డి కొడుకు)
పాంకుంట్ల సాయిరెడ్డి. 85 ఏండ్ల వ్యక్తి. స్వయానా రైతు. అంత ఆషామాషీ మనిషేం కాదు. సుదీర్ఘంగా రాజకీయాల్లో నలిగినవాడు. 13 ఏండ్లు సర్పంచ్‌గా పనిచేసిండు. ఆయన ప్రాణాలు అన్యాయంగా గాల్లో కలిసిపోయినయ్. కారణం.. రేవంత్, ఆయన బ్రదర్సేనని సాయిరెడ్డే స్వయంగా తన సూసైడ్ నోట్లో రాసి చనిపోయిండు. ముదిమి వయసులో, ముసలితనంలో ప్రశాంతంగా జీవించాల్సిన సాయిరెడ్డి బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి కారకులెవరు? ముఖ్యమంత్రి స్వగ్రామం కొడంగల్ నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో ఏ అరాచక కాండ రాజ్యమేలుతున్నది?సొంత ఊరివాడన్న ప్రేమలేదు. తమ కులంవాడేనన్న ఆప్యాయత లేదు. మాజీ సర్పంచ్ అన్న గౌరవం లేదు. 85 ఏండ్ల ముదుసలి అన్న దయకూడా లేదు. ఇది రౌడీ రాజ్యమా? ఎవరు ఎదురొస్తే.. ఎవరు ఎదిరిస్తే.. వాళ్లను వేధించడమేనా ఇప్పుడు జరుగుతున్నది? బలహీనులనూ బాధించే ఈ కిరాతకమేమిటి? వృద్ధులనూ వదలని వికృతమేమిటి? అధికారం అండ చూసుకుని అరాచకీయం వికటాట్టహాసం చేస్తున్నదా?
ఇది తెలంగాణనా? ఫ్యాక్షన్ రాజ్యమా?