హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్ చానల్ ద్వారా ప్రతినెలా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. 3 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు శుక్రవారం ఖైరతాబాద్‌లోని కమిషనర్ కార్యాలయానికి చేరుకొని ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. ఇచ్చే కొద్దిపాటి వేతనం కూడా నెలనెల ఇవ్వకపోవడంతో పంచాయతీ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. జీవో 60 ప్రకారం స్వీపర్లకు రూ. 15,600లు, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రిషి యన్లు, డ్రైవర్లు, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ.19,500 నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బందిని కూడా 2వ పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని, జీవో 51ని సవరించాలని, మల్టీపర్పస్ వరర్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయక కార్యదర్శులుగా నియమించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గ్యార పాండు, ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.