వెంకటాపూర్, సెప్టెంబర్ 4 : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సొంత నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలకు నిధులు కరువయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ‘నేను తోపుడు బండిని.. నా ధర రూ.8 వేలు.. గ్రామంలో మంచి మనసున్న దాతలు ముందుకు వస్తే మన గ్రామపంచాయతీకి వెళ్లి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నా’ అంటూ ముద్రించిన ఫ్లెక్సీని జీపీ కార్యాలయానికి కార్యదర్శి చందూలాల్ బుధవారం తోరణంగా కట్టారు. అలాగే ముఖ్య కూడళ్లలోనూ ఫ్లెక్సీలను కట్టడంతోపాటు వాట్సాప్ గ్రూప్ల్లోనూ పోస్టు చేశారు.
తోపుడు బండి కోసం విరాళాలు పొందేందుకు కార్యదర్శి వినూత్న ప్రయత్నం చేసి బోల్తా పడ్డారు. ఈ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ‘మేజర్ గ్రామపంచాయతీకి నిధులు కరువయ్యాయా? తోపుడు బండిని కొనుగోలు చేసేందుకు పైసలు లేవా? మంత్రి నియోజకవర్గంలో ఇదేం విచిత్రం?’ అంటూ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ప్రజల నుంచి వస్తున్న విమర్శలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారు సదరు జీపీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో గురువారం ఆయన వాటిని తొలగించారు.