Panchayat Raj Act | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తేతెలంగాణ): ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభు త్వం.. బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం-2018ను సవరించేందుకు సిద్ధమవుతున్నది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని నిర్ణయించింది. వీలైతే సోమవారమే క్యాబినెట్ ఆమోదం తీసుకొని మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది.
పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లులో గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలోని కీలక అంశాలను మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు విడతల రిజర్వేషన్ పద్ధతిని తొలగించి పాత విధానంలో ఒకే విడతకు రిజర్వేషన్ కొనసాగించనున్నట్టు తెలిసింది. ముగ్గు రు పిల్లలు ఉన్నా పోటీ చేసేందుకు అవకాశం కల్పించనున్నారు.
ప్రస్తుతం కనీసం ముగ్గు రు ఎంపీటీసీలు ఉన్న మండలాల్లో ఎంపీపీ ని ఎన్నుకునే అవకాశం ఉన్నది. ఈ క్లాజ్‌ను మార్చి ప్రతి మండలానికి కచ్చితంగా ఐదుగురు ఎంపీటీసీలు, ఆపైనా ఉండాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం ఎంపీటీసీ స్థానాలు ఐదు కంటే తక్కువ ఉన్న రాష్ట్రంలోని 22 మండలాల్లో ఎంపీటీసీల సంఖ్య పెరగనున్నది. ఈ సవరణతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాలు 5,817 ఉండగా, మరో 50కిపైగా పెరగనున్నాయి.