హైదరాబాద్, ఏప్రిల్1 (నమస్తే తెలంగాణ): రేషన్‌కార్డులు ఇచ్చాం.. సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం తెరవెనుక కార్డుల కోతకు సిద్ధమైంది. ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్‌ను ప్రధాన సాకుగా చూపుతూ కార్డుల ఏరివేతకు పూనుకున్నది. ఇప్పటికే పంచాయతీ అధికారులతో క్షేత్రస్థాయిలో అనధికార విచారణ ప్రారంభించినట్టు తెలుస్తున్నది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కార్డులు రద్దయ్యే ప్రమాదం ఉన్నదని తెలుస్తున్నది. రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సబ్సిడీగ్యాస్ తదితర సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్నది. మరోవైపు రాష్ట్రంలో దాదాపు 1.01 కోట్ల రేషన్ కార్డులున్నాయి.
తద్వారా ప్రతినెలా 3.25 కోట్ల మంది 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం పొందుతున్నారు. సూటిగా చెప్పాలంటే రాష్ట్ర జనాభాలో 95 శాతం మంది బీపీఎల్ పరిధిలోనే ఉన్నారని కార్డులు నిర్ధారిస్తున్నాయి. ఇదిలా ఉంటే రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా సంక్షేమ కార్యక్రమాల అమలు భారంగా మారడంతోపాటు, కోట్లాది రూపాయలు అనర్హులకు దక్కుతున్నాయని సర్కార్ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో కార్డుల ప్రక్షాళనకు తెరతీసినట్టుగా తెలుస్తున్నది. ప్రస్తుతం గుట్టుచప్పుడు కాకుండా చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఆదాయపు పన్ను శాఖ అందించిన పన్నుదారుల జాబితా ఆధారంగా కార్డుల ఏరివేతకు రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టింది.
ఆదాయ పన్నుదారులే కాకుండా, ఇతర అవసరాల రీత్యా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారి కార్డులను సైతం తొలగించేందుకు పూనుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నల్లగొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా అధికారులు రంగంలోకి దిగినట్టు సమాచారం. ఐటీశాఖ జాబితాలు పట్టుకొని గ్రామాల్లోని కార్డుదారుల వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేయడంతోపాటు, వారి నుంచి ఐటీ దాఖలు డిక్లరేషన్ తీసుకుంటున్నట్టు పలువురు లబ్ధిదారులు చెప్తున్నారు. తద్వారా కార్డుల కోతకు సర్కార్ చర్యలు తీసుకొంటున్నదని తెలుస్తున్నది.
సాధారణంగా కొత్త ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం 6 లక్షలకు మించి సంవత్సర ఆదాయం ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్1 నుంచి మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం, ఖర్చులు, కటింగ్‌లు, చెల్లించిన పన్ను వివరాలను అందులో పొందుపరచడం పరిపాటి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, బడా పారిశ్రామికవేత్తలు, లక్షల్లో వేతనాలు తీసుకొనే ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఆ కోవలో ఉంటారు.
ఐటీ చెల్లించేవారు సాధారణంగా ప్రభుత్వ పథకాలు, ఇతర సబ్సిడీలు పొందడానికి అవకాశాలే లేవు. వారు అనర్హులు కూడా. అయితే ఐటీ చెల్లింపు పరిధిలోకి రాకుండా, వ్యక్తిగత అవసరాల రీత్యా ఐటీ రిటర్న్స్ దాఖలుచేసే వారి కార్డులను సైతం తొలగించేందుకు సర్కార్ పూనుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆదాయపు పన్ను పరిధిలోకి రాకున్నా కూడా సాధారణంగా స్థిరాస్తుల క్రయవిక్రయాల సందర్భంగా, భారీ మొత్తంలో డిపాజిట్లు, కొన్నిరకాల బ్యాంకుల్లో మదుపు పథకాల సొమ్ము మెచ్యూరిటీ సందర్భంగానూ వచ్చే సొమ్ముపై పన్ను వసూలు చేస్తారు. పన్నుగా చెల్లించిన మొత్తాన్ని కూడా తిరిగి పొందడం కోసం కూడా సదరు వ్యక్తులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. గృహరుణాల కోసం, చిరువ్యాపారాల కోసం తకువ ఆదాయం ఉన్న ఎందరో బ్యాంకు రుణాల కోసం ఏదో ఒక ఆదాయం చూపుతూ ఐటీరిటర్న్స్ ఫైల్ చేస్తారు.