హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : పంచాయతీ ఎన్నికల డ్యూటీ కేటాయింపులో చిత్రాలు.. విచిత్రాలు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో ఇష్టారాజ్యంగా అధికారులు డ్యూటీలు వేశారు. కొందరికి రెండు, మూడు విడతల డ్యూటీలు వేయగా, మరికొందరికి అసలు విధులే కేటాయించలేదు. ఇలా ఇష్టారీతిన డ్యూటీలు కేటాయించడంపై టీచర్లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇవేం డ్యూటీలంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరికి మూడు విడతల్లో డ్యూటీలేసి, కొందరికి ఎలా మినహాయింపు ఇస్తారని నిలదీస్తున్నారు. సిద్దిపేట, వరంగల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో ఇలా అత్యధికంగా జరిగినట్టు టీచర్లు ఆరోపిస్తున్నారు. మూడు డ్యూటీలు పడ్డవారిని మినహాయించి, ఒక విడత డ్యూటీని తప్పించాలని కోరుతున్నారు.
ఎన్నికల విధుల కేటాయింపు ఉత్తర్వుల్లో అనేక తప్పులు చోటుచేసుకున్నాయి. ఉద్యోగుల పేర్లు, క్యాడర్/హోదా ఫోన్ నంబర్ల విషయంలో తప్పులు దొర్లాయి. సాక్షాత్తు అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల్లో పలు తప్పులు ఉండటంతో ఏం చేయాలో తోచక టీచర్లు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని ఉత్తర్వుల్లో పేర్లు తప్పుగా నమోదుచేశారు. కొన్ని చోట్ల సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)కి బదులు స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) అని ఉత్తర్వులు ఇచ్చారు. కొన్ని చోట్ల ప్రొటోకాల్ పాటించలేదు. స్కూల్ అసిస్టెంట్లకు రిటర్నింగ్ ఆఫీసర్గా(ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్(ఏఆర్వో)గా వేశారు. అయితే పై క్యాడర్ పోస్టులోని జీహెచ్ఎంలకు ప్రిసైడింగ్ ఆఫీసర్లు(పీవో)గా బాధ్యతలు అప్పగించారు. దీంతో గెజిటెడ్ హెచ్ఎంలు నాన్ గెజిటెడ్ అయిన టీచర్ల కింద పనిచేయాల్సి వస్తుంది. ఇదేం విధానమని హెచ్ఎంలు ప్రశ్నిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల విధుల కేటాయింపుపై టీచర్లు గుర్రుగా ఉన్నారు. కొందరికి మూడు విడతల్లో డ్యూటీలు వేయడం, మరికొందరికి డ్యూటీలే వేయకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరుగనున్నది. మూడు డ్యూటీలు పడ్డవారు 10, 11 తేదీల్లో మొదటి విడత ఎన్నికల్లో పాల్గొనాలి. 12వ తేదీ ఒక్కరోజు రెగ్యులర్ విధులకు హాజరుకావాలి. 13న ఎన్నికల సామగ్రిని స్వీకరించాలి. 14న ఎన్నికలు, కౌంటింగ్. ఇది ముగియగానే 15న మళ్లీ రెగ్యులర్ డ్యూటీకి వెళ్లాలి. 16న పోలింగ్ సామగ్రి స్వీకరించాలి. 17న పోలింగ్ కౌంటింగ్. అంటే 10వ తేదీ నుంచి 17 వరకు 8 రోజులపాటు నిద్రలేని రాత్రులు గడపాల్సిందే. ఇదే విషయంపై కొందరు టీచర్లు ఇటీవలే జిల్లా అధికారులను కలిసి నిరసన వ్యక్తంచేశారు. అయితే అధికారులు మాత్రం ర్యాండమైజేషన్ పద్ధతిలో డ్యూటీలు వేశామంటున్నారు. కొందరు టీచర్లు పైరవీలు చేసుకుని డ్యూటీలు పడకుండా జాగ్రత్త పడ్డట్టు ఉపాధ్యాయుల్లో చర్చ జరుగుతున్నది. కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలు కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. మూడు డ్యూటీలు పడ్డవారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు.