హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో పలు విభాగాల ప్రభుత్వ ఉద్యోగులను శివరాత్రికి దూరం చేసిందనే విమర్శలొస్తున్నాయి. శుక్రవారం శివరాత్రి సందర్భంగా సెలవు అయినా.. పంచాయతీరాజ్, రెవెన్యూ ఉద్యోగులు విధుల్లోనే ఉన్నారు. హైదరాబాద్ జిల్లా ఉద్యోగులకు ముఖ్యమంత్రి కార్యక్రమాల నేపథ్యంలో శివరాత్రి, రెండో శనివారం, ఆదివారం సెలవులు రద్దు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మిషన్ భగీరథ స్పెషల్‌డ్రైవ్ పేరుతో పంచాయతీరాజ్ సిబ్బంది ఈ నెల 7, 8, 9 తేదీల్లో అందుబాటులో ఉండాలని గతంలోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెవెన్యూ శాఖలో ధరణి దరఖాస్తుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను అనధికారికంగానే ఆఫీస్‌కు రప్పించారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి శంకుస్థాపనల నేపథ్యంలో కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా అధికారులు, సూపరింటెండెంట్లు, రెవెన్యూ ఉద్యోగులకు 8,9,10 తేదీల్లో సెలవులు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సోమవారం తర్వాత ఏ క్షణమైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున ఆలోగానే వీలైనన్ని పనులకు శంకుస్థాపన చేసి, ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నదనే ఆరోపణలొస్తున్నాయి. దీంతో రాజకీయ కారణాలతో ఉద్యోగులను శివరాత్రి పండుగకు దూరం చేస్తున్నారని వీహెచ్‌పీ విమర్శించింది. సోషల్‌మీడియాలో నెటిజన్లు సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. రాజకీయ కారణాలతో ఉద్యోగులను పండుగకు దూరం చేస్తారా? అని మండిపడుతున్నారు.