హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : మాటకు మాట.. పదునైన ప్రశ్నలతో అధికారపక్షాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరి చేశారు. బుధవారం సభ ప్రారంభమైన తర్వాత హోంశాఖ నుంచి మొదలు పెట్టి.. రెవెన్యూ, భూ భారతి అంశాలపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు ఒక్కో మంత్రి మైక్ అందుకొని సమాధానాలు ఇచ్చుకోవడంతోనే సమయం గడిచిపోయింది. బీఆర్ఎస్ పక్షం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్న లు సంధిస్తుంటే.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు మంత్రులు బదులిచ్చుకోవాల్సి వచ్చింది. ఒకప్పటి పోలీసు వ్యవస్థ, ప్రస్తు త పోలీసుల తీరును పోల్చుతూ, పెరిగిన క్రైమ్ రేట్‌ను పల్లా సభ ముందు ఉంచడంతో తొలుత మంత్రి పొన్నం ప్రభాకర్ కలుగజేసుకున్నారు. హోంశాఖపై చర్చ సందర్భంలోనే మంత్రి పొన్నం మూడుసార్లు, భట్టి విక్రమార్క రెండు సార్లు కలుగజేసుకున్నారు. రెవెన్యూ అంశం, భూ భారతిపై పల్లా మాట్లాడుతుండగా పొంగులేటి కలుగజేసుకున్నారు. భూ భారతి, ధరణి అంశాల్లో పల్లా వర్సెస్ మంత్రులు అన్నట్టుగా మారింది. పల్లా కౌంటర్లు వేయడంతో మంత్రి పొంగులేటి పదే పదే పల్లా ప్రసంగానికి అడ్డుతగిలారు. ఇదే అంశంపై మరోమారు భట్టి విక్రమార్క స్పందించి ధరణి, భూ భారతిపై వివరణ ఇచ్చారు. ఇరు పక్షాల నుంచి వాదోపవాదాలు జరగడంతో మంత్రులు పొన్నం, భట్టి, పొంగులేటి పదేపదే మైక్ అందుకొని మాట్లాడారు. మొత్తంగా ముగ్గురు మంత్రులు 16 సార్లు పల్లా ప్రసంగానికి అంతరాయం కలిగించారు. ఒకానొక దశలో బీఆర్ఎస్ పక్షం మాట్లాడేందుకు ప్యానల్ స్పీకర్ మైక్ ఇవ్వకపోడంతో మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పోడియం వద్ద నిరసన తెలిపారు. ప్యానల్ స్పీకర్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.
వాకౌట్ అనంతరం మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచే నినాదాలు చేసుకుంటూ బయటికి వచ్చింది. ఎమ్మెల్యేల ఎంట్రీ గేటు వరకు నినాదాలతో హోరెత్తించారు. ‘వద్దురా నాయనా.. 20 పర్సెంట్ పాలన’.. ‘వద్దురా నాయనా కమీషన్ల పాలన’.. ‘ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్య దోపిడీ రాజ్యం’ అంటూ అసెంబ్లీలో నినదించారు.
కాంగ్రెస్ సర్కారు రైతుల నుంచి భూములు గుంజుకోజూస్తే ఊరుకోబోమ ని, సాయుధ పోరాటం, లగచర్ల స్ఫూర్తితో పోరాడుతామని ఎమ్మెల్యే పల్లా హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది భూ భారతి కాదని.. భూ హారతి అని ధ్వజమెత్తారు. మళ్లీ వీఆర్ఏ, వీఆర్వోలను తెస్తున్నారని, దందాలకు తెరలేపారని ఆయన మండిపడ్డారు.
పింకు చొక్కాలు ఉన్నవాళ్లకే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారన్న పొంగులేటి వ్యాఖ్యలకు పల్లా కౌంటరిచ్చారు. తాము అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇవ్వాలంటూ తమ పార్టీలోనే ఉన్న పొంగులేటి సిఫారసు చేస్తే తాము ఇవ్వలేదని పల్లా స్పష్టంచేశారు. ‘ఉన్న వాస్తవం చెప్పాలె.. పొంగులేటి కొంత మందికి ఇవ్వుమని చెప్పినా మేము ఇవ్వలేదు. 2.72 లక్షల డబుల్ బెడ్రూం ఇండ్లను కలెక్టర్, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పద్ధతి ప్రకారమే కేటాయించినం’ అంటూ మంత్రి ఆరోపణలను తోసిపుచ్చారు.