జనగామ రూరల్, ఏప్రిల్14 : వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ మండలం ఎల్లంల, పెంబర్తి, సిద్దెంకి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన పంటలను అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
పంట నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావుతో పాటు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో ఫోన్లో మాట్లాడి పంట నష్టాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ వడగండ్లకు నేలరాలిన రైతులకు ఎకరాకు రూ.10వేలు చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. ఇప్పటికే సాగునీరు అందక వేసిన పంటలు ఎండిపోయాయని, ఇప్పుడు అకాల వర్షంతోపాటు వడగండ్లతో తీవ్రంగా రైతులు నష్టపోయినట్టు చెప్పారు. వరితోపాటు మామిడి, బొప్పాయి, బత్తాయి, సపోట తదితర పంటలు గాలి దూమారంతో పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలిపారు.