చేర్యాల, జనవరి 30 : ప్రజల మనోభావాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే సిద్దిపేట జిల్లా చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. చేర్యాలలో గురువారం రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ వకుళాభరణం నర్సయ్యపంతులు ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాధర్నా, ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రెవెన్యూ డివిజన్ ఏర్పాటును వెంటనే ప్రకటించకపోతే కాంగ్రెస్ నాయకుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశాన్ని సభ దృష్టికి తీసుకువచ్చానని, సీఎంతో పాటు మంత్రులకు వినతిపత్రాలు అందించానని గుర్తుచేశారు. అన్ని పార్టీలు చేర్యాల రెవెన్యూ డివిజన్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ ఎందుకు జీవో జారీ చేయడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకులు జేఏసీ ఏర్పాటు చేసుకుని రెవెన్యూ డివిజన్ కోసం పోరాటాలు చేయడం ఎక్కడాచూడలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇన్చార్జికి చిత్తశుద్ధి ఉంటే సీఎం వద్దకు వెళ్లి డివిజన్ ఏర్పాటు జీవో తీసుకురావాలని సవాల్ విసిరారు. చేర్యాల డివిజన్ కోసం శాసన మండలిలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కేవీఎల్‌ఎన్‌రెడ్డి మాట్లాడుతూ.. చేర్యాల రెవెన్యూ డివిజన్ విషయమై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.