హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై పోలీసులు తక్షణమే కేసు నమోదు చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఇంటిపై దాడికి యత్నించిన కాం గ్రెస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలపై తక్షణమే కేసు లు పెట్టాలని ఆయన కోరారు. కాంగ్రెస్ నా యకులు అడుగుపెట్టడం వల్లే ఆ ప్రాంతం అ పవిత్రమైందని, దీనికి దళితులతో ముడిపెట్టి రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లతో కాంగ్రెస్ శ్రేణులు వ్యవహరించిన తీరు గర్హనీయమని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐ ద్వారా మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను సృష్టించి రాజకీయ పబ్బం గడుపుతున్నదని పల్లా మండిపడ్డారు. ఈ నేరాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆధారాలు సహా తాము ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అత్యంత విలువైన సమయాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించినా భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ సర్కార్‌కు త్వరలోనే బుద్ధి చెప్తామన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉన్నదని, ఆయన నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని టీపీసీసీ అధ్యక్షు డు, ఎమ్మెల్సీ బీ మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టంచేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కేసీఆర్‌కు చెడు జరుగాలని కోరుకోలేదని తెలిపారు. కేసీఆర్‌పై శంకర్ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు చర్య తీసుకోలేదని మీడియా ప్రశ్నించగా.. శంకర్ రేవంత్‌రెడ్డి వీరాభిమాని అని, సీఎంకు పిండప్రదానం చేశారనే బాధతో అలా మాట్లాడి ఉండవచ్చని అన్నారు.