నాడు పాలేరు కరువు ప్రాంతం.. కేవలం ఆముదం, జొన్న వంటి మెట్ట పంటలు పండే ప్రాంతం.. పనుల్లేక వలస వెళ్లే ప్రజలు.. ఖాళీగా దర్శనమిచ్చిన ఊళ్లు.. అవసరానికి భూమి అమ్ముదామన్నా కొనే వాడులేని దైన్యం.. కానీ, స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే పాలేరు నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టింది. భక్తరామదాస ఎత్తిపోతలతో ఇక్కడి రైతుల దశ తిరిగింది. సాగుతోపాటు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నది.
ఖమ్మం, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి పాలనలో కరువుకు కేరాఫ్‌గా ఉన్న పాలేరు నియోజకవర్గం.. స్వరాష్ట్రంలో అభివృద్ధికి మారుపేరుగా తయారైంది. నాడు సాగునీటి వసతి లేక మెట్ట పంటలకే పరిమితమైన రైతులు.. నేడు ఆకుకూరలు, కూరగాయలు, వరి, మిర్చి, పత్తితోపాటు అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. ఏటా రెండు పంటలతో వేల మంది వ్యవసాయ కూలీలకు పని దొరుకుతున్నది.
అప్పుడు ఎకరా భూమి రూ.2-3 లక్షలు ఉండగా, నేడు రూ.35-40 లక్షల వరకు ధర పలుకుతున్నది. రూ.335.59 కోట్లతో పాలేరు జలాశయం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భక్తరామదాసు ఎత్తిపోతల పథకంతో 79,500 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ‘మిషన్ కాకతీయ’ పథకంలో భాగంగా నియోజకవర్గవ్యాప్తంగా 120 చెరువులు, కుంటలకు పూర్వ వైభవం వచ్చింది. సాగునీటికి ఢోకా లేకుండాపోయింది. కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ పరిధిలో కస్తూర్బా గాంధీ విద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. ఆయా విద్యాలయాల్లో ప్రస్తుతం 1,100 మంది బాలికలు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు.
తొలి విడత ‘మన ఊరు- మన బడి’ కింద 75 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆయా పాఠశాలల్లో ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఒక్కో పాఠశాల కార్పొరేట్ స్థాయిలో వసతులు సమకూర్చుకుంటున్నది. పాలేరులోని ఇన్‌టేక్ వెల్ ద్వారా ఖమ్మం జిల్లా 2,75,354 ఇండ్లకు మిషన్ భగీరథ నీరు అందుతున్నది.
పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రం మత్స్యకారుల జీవన ప్రమాణాల పెంపు కోసం పరిశోధనలు చేస్తున్నది. పరిశోధనలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూసుమంచి మండలం జుఝల్రావుపేట పరిధిలోని మల్లాయిగూడెం రహదారి పక్కన 10 ఎకరాల్లో మత్స్య కాలేజీ నిర్మించనున్నది. తద్వారా వందలాది మంది విద్యార్థులు ఫిషరీస్ కోర్సు చదువనున్నారు. రాష్ట్రంలోనే ఇది తొలి మత్స్య కళాశాల కావడం విశేషం. ఖమ్మంలోని పెద్ద దవాఖానకు అనుసంధానంగా ఖమ్మం రూరల్ మండలంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటైంది. ఇదే మండలంలో జేఎన్టీయూ క్యాంపస్ అందుబాటులోకి వచ్చింది.