మహబూబ్ నగర్ : పాలమూరు వ్యక్తి ముఖ్యమంత్రి అయి జిల్లాకు ఏమైనా చేస్తారని ఎక్కువ మంది ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు పాశ్చతాపం పడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) అన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
పాలమూరు ప్రాజెక్ట్ (Palamuru Project )ద్వారా ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునిరు ఇచ్చే అవకాశం ఉందని వివరించారు. ప్రాజెక్ట్ ను సందర్శించి పనులు పూర్తి చేసేందుకు పాలకులు దృష్టి పెట్టాలని సూచించారు. కాళేశ్వరం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా మంత్రులకు ప్రాజెక్ట్‌లపై అవగాహన లేదని దుయ్యబట్టారు. పాలమూరు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్షా చేయాలని, ప్రతిపక్ష పార్టీ నాయకుల అభిప్రాయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. వడ్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు.
వ్యవసాయ రంగాన్ని విస్మరించిన ప్రభుత్వం : మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి
ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని విస్మరించిందని, ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. పండించిన పంట కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ( Lakshma Reddy ) ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్ట్ మీద కనీసం రివ్యూ చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి ప్రాజెక్ట్ ఆపాలని చూసినా 90 శాతం పనులు పూర్తి చేసి ఒక పంపును కేసీఆర్ ప్రారంభించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తిరిగి అధికారం లోకి వచ్చి ఉంటే 5 నెలల్లోనే పాలమూరును పూర్తి చేసే వాళ్లమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే రిజర్వయర్లు నింపుకునేందుకు అవకాశం ఉండేదని, పాలమూరు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు.