నెట్వర్క్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సంబురాలు అంబరాన్ని తాకాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని హర్షిస్తూ కార్మికులు బస్ డిపోల ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. సీఎం కేసీఆర్‌కు తమ కుటుంబాలు జీవితాంతం రుణపడి ఉంటాయని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతున్నదని స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. మహబూబాబాద్‌లోని ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లుతో కలిసి ఆమె సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఆ సంస్థ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశంసించారు. నిజామాబాద్ శివారులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాజిరెడ్డిని ఆర్టీసీ కార్మికులు ఘనంగా సత్కరించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఆర్టీసీ కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే, కార్మికులు క్షీరాభిషేకం చేశారు. మెదక్ ఆర్టీసీ డిపో గ్యారేజ్‌లో బుధవారం నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సాకారం చేశారని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, పద్మాదేవేందర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే న్యాయం జరుగుతుందని వారు చెప్పారు.
కల్లూరు: వీఆర్ఏల సమస్యలకు పరిష్కారం చూపి సీఎం కేసీఆర్ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో బుధవారం ఆయన వీఆర్ఏలతో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాటాడుతూ.. సీఎం కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మందికి పైగా వీఆర్ఏల జీవితాలు మారనున్నాయని తెలిపారు. ఎన్నికల కోసమో, రాజకీయం కోసమో సీఎం ఈ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రతిపక్షాలు స్వార్థంతోనే లేని పోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.
మెట్పల్లి రూరల్ : బీడీ కార్మికుల తరహాలో టేకేదారులకు జీవనభృతి కల్పించాలని క్యాబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై టేకేదార్లు సంబురపడుతున్నారు. బుధవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్‌లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు చిత్రపటానికి బీడీ టేకేదార్లు క్షీరాభిషేకం చేశారు.