(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఉగ్రదాడులను ఎగదోసి ఆపై భారత్ చేతిలో చావుదెబ్బలను తింటున్న దాయాది పాకిస్థాన్.. సాధారణ పౌరులను కూడా కవచాలుగా వాడుకొంటున్నది. శుక్రవారం రాత్రి భారత్‌లోని పలు ప్రాంతాలపై డ్రోన్ దాడులకు తెగబడ్డ పాక్.. దీనికి ప్రతిగా భారత్ ఎదురుదాడి చేస్తే ఏం చేయాలన్నదానిపై ముందుగానే నిర్ణయానికి వచ్చింది.
ఇందులో భాగంగా తమపై భారత్ ప్రతిదాడులు జరుపకుండా ఉండేందుకు పౌర విమానాలను కవచాలుగా వాడుకొన్నది. ఈ మేరకు భారత్‌పై డ్రోన్ దాడులు జరుగుతున్న సమయంలో రెండు ప్రయాణికుల విమానాలు లాహోర్ సమీపంలో ప్రయాణించినట్టు ఎన్డీటీవీ ఓ కథనంలో వెల్లడించింది. దీనికి సంబంధించి ఫ్లైట్ ట్రాకింగ్ ఫొటోలను ప్రచురించింది. దీంతో పౌరుల ప్రాణాలను కూడా పాక్ పణంగా పెడుతుందంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు కనిపించాయి.