హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులపై ఉగ్రదాడి దుర్మార్గమని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర పేర్కొన్నారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. తీవ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా గురువారం రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు పెద్దఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడు తూ.. ఇలాంటి సమయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఏరివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పులిహారి గోవర్ధన్‌రెడ్డి, ఉపేంద్ర, రామచంద్రారావు సత్యనారాయణరెడ్డి, విప్లవరెడ్డి, ప్రదీప్, నరేశ్, రాజేశ్వర్‌రావు, న్యాయవాదులు పాల్గొన్నారు.
పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్య అని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు గురువారం సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సంతాపం ప్రకటించింది. దాడిలో మరణించిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానూభూతి తెలిపింది. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి ఏనుగు సత్యనారాయణ, నాయకులు శ్యామ్, కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఉగ్ర దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల దాడిని బార్ కౌన్సిల్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.