ములుగు : మేడారం మహా జాతర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గోవిందరాజును బుధవారం ఉదయం 6 గంటలకు, పగిడిద్దరాజును 9.45 గంటలకు పూజారులు ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జాతర కార్యనిర్వహణాధికారి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భక్తులను గద్దెల ప్రాంగణంలోకి రానివ్వకుండా భద్రత ఏర్పాట్లు చేపట్టారు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు కుటుంబాలతోపాటు హాజరై పూజా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. మేడారం జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరుగనుంది. దీనికి తెలంగాణతోపాటు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల నుంచి కోటి మందికిపైగా భక్తులు తరలి వస్తారని అంచనా.
ఈ సారిగా నూతనంగా నిర్మించిన గద్దెలపై సమ్మక్క, సారలమ్మతోపాటు పగిడిద్ద రాజు, గోవిందరాజులను కొలువుదీర్చుతున్నారు. జాతర ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్ఠంగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నారు. 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉండనుంది. దాని మధ్య 40 అడుగుల వెడల్పుతో మూడు, 30 అడుగుల వెడల్పుతో ఐదు స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పు ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది.
పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను సమ్మక్క-సారలమ్మ గద్దెలు ఉండే వరుసలోకి మార్చారు. ఈ ఏర్పాటు ద్వారా భక్తులంతా ఒక వరుసలో దర్శనానికి వెళ్లేందుకు వీలు కలుగనుంది. వృత్తాకారంలో ఉండే గద్దెల చుట్టూ 8 స్తంభాలు ఉంటాయి. వాటి మధ్యలో వెదురు బొంగులతో డెకరేషన్ చేస్తారు.