మెదక్ అర్బన్ , ఏప్రిల్ 12 : మెదక్ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ నర్సింగ్ కళాశాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించి, విద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మెదక్ నర్సింగ్ కళాశాలలో 120 మంది విద్యార్థినులకు ఒకే టాయిలెట్ ఉండటం దురదృష్టకరమని చెప్పారు.
కుళ్లిపోయిన కూరగాయలతో వంటలు చేస్తున్నారని, కళాశాల డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేక కంపు కొడుతున్నదని ఆరోపించారు. విద్యార్థినుల నుంచి అదనపు మెస్‌చార్జీలు వసూలు చేస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్‌చేశారు. వారంరోజుల్లో కళాశాలలో సౌకర్యాలు కల్పించకపోతే, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా చేపడుతామని హెచ్చరించారు.