మెదక్ అర్బన్, జూన్ 20 : రాష్ట్రంలో కమీషన్ల కోసమే మంత్రులు పనిచేస్తున్నారని, కాంగ్రె స్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం మెదక్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ ఎ మ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ యూరియా యాప్ తె చ్చి రైతులను అరిగోస పెడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేశారని, రైతుబంధు, ఉచిత కరెంట్, రైతుబీమా, సకాలంలో యూరియా, ఎరువులు అందించి రైతులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పంటల కొనుగోలులో విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
రాష్ట్రంలో దళారీ వ్యవస్థ నడుస్తున్నది : శేరి
రాష్ట్రంలో దళారీ వ్యవస్థ నడుస్తున్నదని, ఎక్కడ కమీషన్ ఇస్తే అక్కడ మంత్రులు పనులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఆరోపించారు. రైతులు పండించిన వరి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేవరకు బీఆర్ఎస్ పోరా టం చేస్తుందని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.