హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ‘జలదృశ్యంలో పార్టీ దిమ్మె కట్టించి.. అనుక్షణం అధినేత కేసీఆర్‌కు వెన్నంటి ఉంటూ.. నిరంతరం పార్టీ అభ్యున్నతి కోసం పరితపించిన హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు హాస్యాస్పదం..’ అని మెదక్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మా దేవేందర్‌రెడ్డి ఖండించారు. కొన్నిరోజులుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్నదని బుధవారం ఒక ప్రకటనలో వాపోయారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. పేగు బంధం కన్నా కోట్లాది మంది తెలంగాణ ప్రజలు, పార్టీ కార్యకర్తలే ముఖ్యమని భావించడం గొ ప్ప విషయమని పేర్కొన్నారు.
మహాశివుడికి నందిలాగా కేసీఆర్‌కు హరీశ్‌రావు అ డుగడుగునా అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. అలాంటి నేతను బలహీనపరిచేలా వ్యాఖ్యలు చేయడం పార్టీకి నష్టం కాదా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్లోనే ఆమె అర్థంపర్థం లేని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కార్యకర్తగా, నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మం త్రిగా, ట్రబుల్ షూటర్‌గా పార్టీకి సేవలందించిన ఘనత హరీశ్‌రావు సొంతమని స్పష్టంచేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్‌పై జరిగిన చర్చలో సీఎం, మంత్రులకు ముచ్చెమటలు పోయించి పార్టీలో ఉత్సాహం నింపిన వేళ కవిత అదే కాళేశ్వరాన్ని అడ్డంపెట్టుకొని ఇష్టారీతినా మాట్లాడటం దురదృష్టకరమని వాపోయారు.
పార్టీ అభివృద్ధి కోసం ఆలోచించేవారు హరీశ్‌రావుపై ఆధారరహితంగా ఆరోపణలు చేయరని ఆక్షేపించారు. ఆయన రేవంత్ కాళ్లు మొక్కారని చెప్పడం బాధాకరమని వాపోయారు. నిండు శాసనససభలో కాంగ్రెస్ దురాగాతాలను చీల్చిచెండాడుతున్న హరీశ్‌రావు ఆ పని చేశారంటే తెలంగాణ సమాజం నమ్మబోదని పేర్కొన్నారు. ఆయనను నిందించడం వల్ల ఎవరికీ లాభమో తెలియదా? అని ప్రశ్నించారు.