హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : ‘నువ్వు భయపెడితే భయపడేటోడు ఎవ్వడూ లేడు.. నేను హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న. దమ్ముంటే, ఎక్కడికి రావాలో ప్లేస్ చెప్పు.. నీ ఖైరతాబాద్ చౌరస్తాకు రావాల్నా? ఆశోక్‌నగర్ చౌరస్తాకు రావాలా? నువ్వు డేట్, టైం, ప్లేస్ చెప్పు.. వచ్చేందుకు నేను సిద్ధం’ అంటూ దానం నాగేందర్‌కు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు.
శనివారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘గతంలో అందరం కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చికూతలు కూస్తే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ సుధీర్‌రెడ్డి కలిసి ఉరికించింది మరిచిపోయినవా?’ అంటూ ప్రశ్నించారు. ‘అలా మళ్లోసారి కావాల్నా?’ అంటూ హెచ్చరించారు. ‘నీకు నడవ చాతకాదు, నన్ను ఉరికిస్తవా?’ అంటూ ఎద్దేవాచేశారు. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ హెచ్చరించారు.
‘దానం నాగేందర్.. నువ్వు టీషర్ట్లు వేసుకొని పౌడర్ కొట్టుకొని తాజ్ కృష్ణ ఇండోర్ స్టేడియంలో అడే ఆటలన్నీ నాకు తెలుసు’ అంటూ ధ్వజమెత్తారు. ‘ఇక్కడ ఉన్నది కేసీఆర్ శిష్యులం.. భయపెట్టిస్తే భయపడేటోళ్లం కాదు’ అంటూ తెగేసిచెప్పారు. దానంకు నైతిక విలువలు ఉంటే కేసీఆర్ పెట్టిన భిక్ష అయిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. స్పీకర్ సమక్షంలోనే, నిండు సభలో శాసనసభ్యులనే తిరగనివ్వం, చంపేస్తామంటున్నాడంటే ఇక ప్రజల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తంచేశారు.
కేసీఆర్ హయాంలో 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడికి కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కౌశిక్‌రెడ్డి సవాల్ చేశారు. ఈ సవాల్‌ను గతంలో అనేకసార్లు చేసినా ఇంతవరకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు స్పందించలేదని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలోని ప్రైవేట్ రంగంలో పది లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారని, ఆ రెండు పార్టీల పాలిత రాష్ర్టాల్లో అంతకు ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్టు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని స్పష్టంచేశారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా కాంగ్రెస్ ఇస్తామన్న రెండు లక్షల కొత్త ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇంతవరకు ఒక్క ఉద్యోగాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయలేదని చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లతో భర్తీ అయిన ఉద్యోగాలను సీఎం రేవంత్‌రెడ్డి సిగ్గూశరం లేకుండా తాము ఇచ్చామని చెప్పుకొంటున్నారని ధ్వజమెత్తారు.
ఎన్నికలప్పుడు జాబ్ క్యాలెండర్‌పై రేవంత్, భట్టి సంతకాలతో భారీ పత్రికా ప్రకటనలు ఇచ్చారని, వేయికండ్లతో ఎదురుచూసిన నిరుద్యోగులను నిన్న ఉత్త కాగితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ నిరాశపరిచిందని కౌశిక్‌రెడ్డి విమర్శించారు. తాము సభలో నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడుతుంటే సీఎం రేవంత్ దానం నాగేందర్‌ను రెచ్చగొట్టి బూతులు తిట్టించారని మండిపడ్డారు. ‘నీయమ్మ అని అమ్మను తిట్టడం సంస్కారమా? అని అడుగుతున్నా’ అంటూ కౌశిక్‌రెడ్డి నిలదీశారు. నిబంధనల ప్రకారం సభలో సభ్యుడికి కేటాయించిన సీటునుంచే మాట్లాడాలని, అందుకు విరుద్ధంగా దానం మరో సీటు నుంచి మాట్లాడారని చెప్పారు.