హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డిది తుగ్లక్ పాలన అని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్ధన్‌రెడ్డి, తుంగ బాలుతో కలిసి ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ (ఎక్స్) హ్యాండిల్లో ఎవరి పాలన బాగుందని సర్వే నిర్వహిస్తే కేసీఆర్ పాలనే బాగుందని 70 శాతం మంది నెటిజన్లు ఓటు వేశారని తెలిపారు.
దాదాపు 90 వేల మంది ఈ ఓటింగ్‌లో పాల్గొనట్టు చెప్పారు. సొంత పార్టీ సర్వేలోనే నెటిజన్లు కాంగ్రెస్ చెంప ఛెల్లుమనిపించారని చెప్పారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి సునీల్ కనుగోలు ప్రధాన సూత్రధారి అని, ఇప్పుడు ఓటింగ్ పెట్టి ఆయనే అభాసుపాలయ్యారని విమర్శించారు. ఆరు నెలల దాకా ఎన్నికల కోడ్ పేరు చెప్పి రైతు భరోసాను ఆపే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో సుమారు 40 వేల మందికి ఇండ్లు లేవని రేవంత్‌రెడ్డి సర్కారు ప్రకటించిందని తెలిపారు.
కానీ, కేవలం 830 ఇండ్లు మాత్రమే మంజూరు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎవరి సంతకం లేకుండానే సంక్షేమ పథకాల మంజూరు లేఖలు ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఇండ్లకు మంజూరు పత్రాలివ్వాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో దళితబంధు రెండో విడత నిధులు మంజూరు చేయడం బీఆర్ఎస్ సాధించిన విజయం అని పేర్కొన్నారు. గుంట భూమి కూడా లేని ప్రతిఒక్కరికీ ఆత్మీయ భరోసా అందించాలని కోరారు.