Padi Kaushik Reddy | కరీంనగర్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 పరీక్షల్లో పెద్ద కుంభకోణం జరిగిందని, వెంటనే రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, టీజీపీఎస్సీ చైర్మన్, సీఎం రేవంత్‌రెడ్డిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద స్కాం జరిగినా కేంద్రం మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఈటల రాజేందర్, అరవింద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి మూటలు పంపుతున్నారని ఆరోపించారు.
టీజీపీఎస్సీ వెబ్సైట్ డాటా ప్రకారం 21,093 మంది పరీక్ష రాస్తే 21,103 మందికి రిజల్ట్ ఎలా ఇచ్చారని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. తన ఆరోపణలపై టీజీపీఎస్సీ అధికారులు స్పందించారని, కానీ పది మంది సంగతి చెప్పలేదని వెల్లడించారు. మార్చి 13న ఇచ్చిన నివేదికలో ఉర్దూ మీడియంలో 9 మంది పరీక్ష రాసినట్టు ఉన్నదని, ఈ నెల 15న పత్రికా ప్రకటనలో 10 మంది పరీక్ష రాసినట్టు చూపారని తెలిపారు. ఒక్కరు ఎలా పెరిగారని ప్రశ్నించారు. ప్రిలిమ్స్‌కు ఇచ్చిన హాల్ టికెట్లు, మెయిన్స్‌కు ఎందుకు మా ర్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకుడు రాములునాయక్ కోడలుకు 206 ర్యాంక్ రాలేదని చెప్తున్నారని, కానీ ఆమెకు 206 ర్యాంక్, మల్టీజోన్‌లో నంబర్‌వన్ ర్యాంకు వచ్చినట్టు టీజీపీఎస్సీ వెబ్సైట్ చూపుతున్నదని కౌశిక్‌రెడ్డి తెలిపారు. రాములు నాయక్ కోడలు పరీక్ష రాసిన కోఠి సెంటర్‌కు గాంధీభవన్ నుంచి జవాబు పత్రం వచ్చిందనేది స్పష్టంగా తెలుస్తున్నదని ఆరోపించారు. ఫలితాల్లో అదనంగా చేరిన 10 మంది లో ఆమె ఉందనే అనుమానం ఉన్నదని, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మార్కుల లిస్ట్ ఆన్లైన్లో ఎందుకు పెట్టలే?
నోటిఫికేషన్ ఇచ్చినపుడు మార్క్స్ లిస్ట్‌ను ఆన్లైన్లో పెడతామని చెప్పి, అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఎందుకు పంపించారని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. గ్రూప్-1 రాసిన అమ్మాయి పేరును ప్రెస్మీట్లో ప్రస్తావించినందుకు ఆమెపై కక్ష కట్టారని, ఆమెకు 483 మార్కులు మొదట వచ్చాయని, రీకౌంటింగ్‌కు వెళ్లితే 423 మార్కులు ఇచ్చారని, 60 మార్కుల తేడా ఏ రీకౌంటింగ్లోనైనా చూపారా? అని ప్రశ్నించారు. ఇలా ఎందుకుచేశారని అడిగితే.. ఆ అమ్మాయి ఫోర్జరీ చేసిందని అధికారులు చెబుతున్నారని, గ్రూప్-1 పరీక్షలకు ఫోర్జరీ చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్‌ఫ్లాప్ అయిందని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా స్కాంలు చేస్తున్నదని కౌశిక్‌రెడ్డి ధ్వజమెత్తారు. తమిళనాడులో 2021 డిసెంబర్ 3న గ్రూప్-4 నిర్వహించారని, రెండుసెంటర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తే పరీక్షలు రద్దు చేసి సీబీఐ విచారణ చేపట్టారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు గ్రూప్-1 పరీక్షల్లో తప్పు జరిగిందని వచ్చిన ఆరోపణలపై స్పందించిన కేసీఆర్ వెంటనే రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఎగిరెగిరిపడ్డారని, ఇప్పుడు కేంద్రమంత్రిగా ఉండీ మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సహకారంతోనే గ్రూప్-1 పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పరీక్ష రద్దుచేసి జ్యుడీషియల్, సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
కోఠి ఉమెన్స్ కాలేజీ పరీక్ష హాల్లో 1,437 మంది పరీక్షలు రాస్తే 74 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని, మిగతా 25 సెంటర్లలో 10,135 మంది పరీక్షలు రాస్తే 69 మంది మాత్రమే ఎంపికయ్యారని తెలిపారు. ఈ సెంటర్లోనే పక్కాగా స్కాం జరిగిందని ఆరోపించారు. కోఠిలో పరీక్ష రాసేందుకు పురుషులకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని అడిగితే, అందులో పురుషులకు మూత్రశాలలు లేవని సిల్లీగా సమాధానం చెప్పారని తెలిపారు. ఇంతకన్నా పెద్ద జోక్ మరొకటి లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని మిగతా ఉమెన్స్ కాలేజీల్లో పురుషులు, మహిళలు కలిసి పరీక్షలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు.
గ్రూప్-1లో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష పార్టీగా పూర్తి ఆధారాలతో బయటపెట్టామని, దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఒకరిద్దరు నాయకులు, అధికారులు తప్పు చేస్తే చాలా మంది నిరుద్యోగుల జీవితాలు వ్యర్థమవుతాయని, అసెంబ్లీలో చాలా సార్లు ప్రశ్నించినపుడు సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ ఎలాంటి సూచనలు, సలహాలైనా స్వీకరిస్తామని చెప్పారని, ఇప్పుడు గ్రూప్-1లో తప్పు జరిగిందని కౌశిక్‌రెడ్డి చాలా స్పష్టంగా చెబుతున్నారని, రేవంత్‌రెడ్డి సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ కరీంనగర్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, నాయకుడు నేతి రవివర్మ తదితరులు పాల్గొన్నారు.