హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఇసుక అక్రమ దందా కోసమే కాంగ్రెస్ గూండాలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల చెక్‌డ్యాంను పేల్చేశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనుగుల చెక్‌డ్యాం బ్లాస్ట్ అయిందని ఇరిగేషన్ డీఈఈ ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. బాధ్యులను రైతులు పట్టుకొని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారని, వారి ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకుల పేర్లే ఉ న్నాయని, ఫిర్యాదు పత్రంలో వందలాది మంది రైతులు సంతకాలు చేశారని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అక్రమార్జన కోసం ఇలాంటివారు అన్నదాతలను అరిగోస పెడుతున్నారని మండిపడ్డా రు. రైతుల కోసం నాడు కేసీఆర్ అనేక మంచి పనులు చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు ఆ అభివృద్ధి పనులను ధ్వంసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. సీఎం కనుసన్నల్లోనే ఆయ న అనుచరులు అక్రమ దందాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అధికార పార్టీకి చెందిన సార య్య, సుధాకర్‌రెడ్డి తనుగుల చెక్‌డ్యాంను జిలెటెన్ స్టిక్స్‌తో పేల్చేసిన విషయాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధారాలు సహా బయటపెట్టారని గుర్తుచేశారు. కానీ హరీశ్‌రావుపై అధికార పార్టీకి చెందిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అనుచిత వ్యాఖ్యలు చేయడం వి డ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు. ‘పేల్చివేసినట్టు నిరూపించాలని ఆయన హరీశ్‌రావుకు సవాల్ విసిరారని, తాను ఆ సవాల్‌ను స్వీకరించి ఆధారాలను బహిర్గతం చేస్తున్నానంటూ వీడియోను ప్రదర్శించారు. విజయరమణారావుకు దమ్మూధైర్యం ఉంటే మాటకు కట్టుబడి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చెక్‌డ్యాం కూలిపోవడానికి హరీశ్‌రావే కారణమని వివేక్ అవివేకంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. 2021లో చెక్‌డ్యాంకు శంకుస్థాపన చేశారు..2024లో పూర్తిచేశారు. కాంగ్రెస్ హయాంలోనే క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇచ్చారు’ అని గుర్తుచేశారు. కానీ వివేక్, విజయరమణారావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకోబోమని, దమ్ముంటే పేల్చేసిన డ్యాంవద్దకు రావాలని, తాను సమీపంలోని ప్రజలందరితో కలిసి వస్తానని సవాల్ విసిరారు. ఇదే తరహాలో భోజన్నపేటలోని హుస్సేన్‌మియా వాగుపై కూడా ఇసుకను తవ్వుకొనేందుకు కాంగ్రెస్ నాయకులు చెక్‌డ్యాంను బద్దలుకొట్టారని ఆరోపించారు.
తనుగుల చెక్‌డ్యాంను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీయే నిర్మించిందని పాడి కౌశిక్‌రెడ్డి గుర్తుచేశారు. కానీ సీఎం ఆ కంపెనీపై అపార ప్రేమను చూపుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే వేలాది కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని, చివరకు ఆయన తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో కూడా అనేక పనులను అప్పగించారని గుర్తుచేశారు. నిజంగా కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని, టెండర్లు రద్దు చేసి నిధులు రికవరీ చేయాలని, తనుగుల చెక్‌డ్యాంను పునరుద్ధరించి నీరందించి రైతులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీఎం పట్టించుకోరని, కానీ కనీసం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ అయినా చొరవచూపాలని డిమాండ్ చేశారు.
‘నీటి వనరులను ధ్వంసం చేయడం వంద మర్డర్లు చేసిన దానికంటే తీవ్రమైన నేరం. యుద్ధనేరాల కంటే అత్యంత తీవ్రమైనది. ఇది నేను చెప్తున్నది కాదు. జెనీవా అంతర్జాతీయ ఒప్పందంలోనే ఉన్నది’ అని బీఆర్ఎస్ ప్ర ధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఉద్ఘాటించారు. నమ్మి గద్దెనెక్కిస్తే కాంగ్రెస్ నాయకులు తెలంగాణ వనరులను చెరబడుతున్నారని ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ రవా ణా కోసం తనుగుల చెక్ డ్యాంను జిలెటిన్ స్టిక్స్‌తో పేల్చి వేశారని ఆరోపించారు. ఇందు లో కాంగ్రెస్ నేతల హస్తమున్నదని ఆరోపించారు. దీనిపై పాలకుర్తి డిప్యూటీ ఇంజినీర్ ఫి ర్యాదు చేశారని, ఆ రోజు రాత్రి 10 గంటల సమయం లో భారీ శబ్దం వచ్చిందని అక్కడి రై తులు తనకు ఫిర్యాదు చేశారని డీఈఈ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ఘటనలో కాంగ్రెస్‌కు చెందిన వారే నిందితులుగా ఉన్నారని ఆరోపించారు. ఇంతటి విధ్వంసం జరిగితే ప్ర భుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు.
గతంలో కాళేశ్వరంపైనా కొందరు రాజకీయలబ్ధి కోసం ఇదే తరహా కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆరు నెలల క్రితం తాను పూర్తి ఆధారాలతో మీడియా దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పు డు తనుగుల చెక్‌డ్యాం పేల్చివేత చూస్తుంటే తాను ఆనాడు చెప్పింది.. చేసిన విమర్శలు ముమ్మాటికీ నిజమేనని తేలిందని చెప్పారు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ ఏడో బ్లాక్‌లోని 17వ పిల్లర్‌ను జిలెటిన్ స్టిక్స్‌తో పేల్చివేశారని, దీంతో పక్కన ఉన్న పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని చెప్పారు. అదేరోజు మేడిగడ్డ డిప్యూటీ ఇంజినీర్ రవికాంత్ మహదేవ్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. రెండేండ్లు దాటినా కేసులో పురోగతి లేదని, లేదంటే ఆధారాలు లేవని ఎందుకు మూసివేయలేదని ప్రశ్నించారు. ఎవరినో కాపాడేందుకే అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే పోలీసులు వెనుకడుగు వేస్తున్నారని అనుమానం వ్యక్తంచేశారు.
తెలంగాణలో ఫేక్ లీడర్లు ఉన్నారని, మాఫియా లీడర్లు మంత్రులయ్యారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారి పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, తెలంగాణ వనరులు విధ్వంసానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అధికార పార్టీ ఇసుక దందా, అక్రమార్జనకు అంతేలేకుండాపోయిందని విమర్శించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే కామన్సెన్స్ లేకుండా హరీశ్‌రావుపై ఆరోపణలకు దిగడం దుర్మార్గమని ఖండించారు. తనుగుల చెక్‌డ్యాం బ్లాస్టింగ్‌ను హరీశ్‌రావుకు అంటగట్టడం ఆయన చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. ఇప్పటికైనా అటూ మేడిగడ్డ, తనుగుల చెక్‌డ్యాం బ్లాస్టింగ్‌లపై సీబీఐతో విచారణ చేయించి నిజానిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్పై, కేసీఆర్ కట్టిన కాళేశ్వరంపై ఒంటికాలిపై లేచే కేంద్ర మంత్రి బండి సంజయ్.. తనుగుల చెక్‌డ్యాం పేల్చివేతపై ఎందుకు స్పందించడం లేదని పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. గతంలో కాళేశ్వరం పిల్లర్లు కుంగితే ఆగమేఘాలపై ఎన్డీఎస్ఏకు ఫిర్యాదు చేసిన ఆయన.. ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉంటున్నారు? అందులో ఆంతర్యమేమిటి? తన నియోజకవర్గంలోని రైతులంటే ఆయనకు పట్టదా? వారిపై ప్రేమలేదా? పంటలకు నీరందించాలనే బాధ్యత ఆయనకు లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి చెక్‌డ్యాం బ్లాస్టింగ్పై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేదంటే రెండు పార్టీలు కుమ్మక్కయినట్టు భావించాల్సి వస్తుందని తేల్చిచెప్పారు.