హైదరాబాద్ : బీసీ కమిషన్(BC Commission) పనితీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(Padi Kaushik Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ కమిషన్ కాంగ్రెస్ కమిషన్లా తయారైందని ఆరోపించారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం శుక్రవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన బహిరంగ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమిషన్ మీద ఉన్న గౌరవంతో ఇక్కడికి వస్తే మాట్లాడేందుకు సమయం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా కమిషన్ ముందుకు రాలేదని, కమిషన్ మీద కాంగ్రెస్‌కు నమ్మకం లేదు కాబట్టే ఎవరు రాలేదని ఎద్దేవా చేశారు. డెడికేటెడ్ కమిషన్‌తోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాల్నారు. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల ప్రతినిధులు ప్రజలు అభిప్రాయాలు చెప్పేందుకు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ విచారణ కొనసాగనున్నది. వచ్చే నెల 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టనున్నది.