తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి బియ్యాన్ని (సీఎంఆర్) అప్పగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమస్యలు సృష్టిస్తోందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తన చేతకానితనాన్ని తెలంగాణ ప్రభుత్వ వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేస్తోందని, ఇది చాలా విచారకరమన్నారు.
సోమవారం నాడు పౌరసరఫరాల భవన్‌లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఇస్తామని చెప్పిన బియ్యాన్ని ఇ్వలేదని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ పార్లమెంటులో చేసిన ప్రకటనను ఆయన తీవ్రంగా ఖండించారు.
‘బియ్యం ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? బియ్యం నిల్వకు స్టోరేజ్ స్పేస్, వ్యాగన్ మూమెంట్ (ర్యాలు) కల్పించడంలో కేంద్రం (ఎఫ్‌సీఐ) పూర్తిగా విఫలమైంది. ఒకవైపు తనిఖీల (ఫిజికల్ వెరిఫికేషన్) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లింగ్ నిలిపివేస్తుంది. మరోవైపు బియ్యం నిల్వలకు అవసరమైన గోదాములను ఇవ్వడం లేదు. బియ్యం రవాణాకు అవసరమైన (ర్యాలు) ఏర్పాటు చేయడం లేదు’ అని ఆయన ఆరోపించారు.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే తన సొంత నిధులతో ధాన్యం కొనుగోలు చేసి, తనిఖీలు (ఫిజికల్ వెరిఫికేషన్) చేస్తుంటే కేంద్రం సమస్యలు సృస్టిస్తోందని విమర్వించారు. ఒక్క జిల్లాలోని రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహిస్తే రాష్ట్రం మొత్తం మిల్లింగ్ నిలిపివేయడంలో అర్థమేమిటి? అంటూ ప్రశ్నించారు. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ఒక నెలలో 23 రోజులు, మరో నెలలో 16 రోజులు మిల్లింగ్ నిలిచిపోయిందని వెల్లడించారు.
దీనికి తోడు డిమాండ్ మేరకు స్టోరేజ్ స్పేస్ కల్పించక పోవడం వల్ల రాష్ట్రంలో రైస్ మిల్లుల్లో, గోదాముల్లో ఎక్కడికక్కడ ధాన్యం నిల్వలు పేరుకపోయాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను మరిచి బియ్యం అప్పగించడానికి అవసరమైన గోదాములను, వ్యాగన్ మూమెంట్‌ను సమకూర్చకుండా తనిఖీల (ఫిజికల్ వెరిఫికేషన్) పేరుతో సమస్యలను సృష్టిస్తోందని మండిపడ్డారు. బియ్యం నిల్వలకు గోదాములు అడిగితే జెమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటేనే ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని తీవ్రంగా ప్రశ్నించారు.