తిమ్మాపూర్, ఏప్రిల్ 17: ఓ వైపు మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ సంకల్పం అని చెప్పుకునే ప్రభుత్వ పెద్దల వాగ్ధానాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా లేవు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ అవకాశాన్ని మహిళలకు ఇచ్చినట్టే ఇచ్చి అధికార యాత్రంగం వెనక్కి తీసుకుంది. కొనుగోలు కేంద్రాల (Paddy Procurement Centers) ద్వారా తమకు ఎంతో కొంత ఉపాధి దొరుకుతుందని ఆశలు పెట్టుకున్న మహిళా సంఘాల సభ్యులు, ప్రతినిధుల ఆశలను అధికారులు ఉసూరుమనిపించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించేలా సంఘ ప్రతినిధులకు ట్రైనింగ్ ఇచ్చి, అన్ని రికార్డులు అందజేసిన అధికారులు.. ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం అనడంతో మహిళలు అసంతృప్తికి లోనయ్యారు.
తిమ్మాపూర్ మండలంలో ప్రతీ గ్రామంలో పోరండ్ల, నుస్తులాపూర్ సొసైటీలతో పాటూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం యాసంగికి మండలంలోని 15 గ్రామాల్లో సెంటర్లను మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, సివిల్ సప్లయ్ శాఖ ఆధ్వర్యంలో రెండుమూడు రోజులు ఆయా గ్రామాల మహిళా సంఘాల సీఏలు, సభ్యులకు కరీంనగర్లో ట్రైనింగ్ సైతం అందజేశారు. రికార్డుల నిర్వహణ, మాయిశ్చర్ చూడడం, తూకం, సెంటర్ నిర్వహణ, రైతులతో సత్సంబంధాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. 15సెంటర్లకు సరిపడా సభ్యులకు ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు కేవలం పోలంపల్లి గ్రామానికి మాత్రమే మహిళా సంఘాల ద్వారా అవకాశం కల్పించారు.
అధికారులు ట్రైనింగ్ ఇచ్చి సెంటర్ల వద్ద ఏర్పాటు చేసేందుకు ఫ్లెక్సీలు అందజేశారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు నిర్వహించే స్థలాల్లో నిర్వహణ కోసం గుడిసెలు సైతం ఏర్పాటు చేసుకున్నారు. రైతులు వడ్లు ఆరబెట్టేందుకు స్థలాన్ని చదును చేయించారు. పలు సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంటర్లు తమ చేతిలోకి వచ్చినట్టే అనుకున్న తరుణంలో అధికారులు బాంబు పేల్చారు. ఈ పసలుకు మహిళా సంఘాలకు అనుమతులు లేవని, నెక్స్ట్ టైం వస్తుందేమో చూద్దాం అంటూ సెర్ఫ్ అధికారులు తెలపడంతో వారు ఆందోళనకు గురయ్యారు.
మహిళలను కోటీశ్వరులను చేస్తామని అని చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు.. క్షేత్రస్థాయిలో తమకు ఉపాధి కల్పిస్తామని ఇప్పుడు సెంటర్లు అలాట్ కాలేదని చెప్తున్నారని సీఏలు, సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదే కోటీశ్వరులను చేసేదని ప్రశ్నిస్తున్నారు. విషయం బయటకు వస్తే అధికారులు తమను ఎక్కడ ఇబ్బంది పెడుతారోనని విషయం బయటకు రానీయడం లేదు. సీఏలు సైతం చిన్న ఉద్యోగులం.. మళ్లీ మాకే ఇబ్బంది అవుతుందంటూ విషయం చెప్పలేకపోతున్నారు. మహిళా సంఘాల చేతికి వచ్చిన కేంద్రాలు.. తిరిగి సొసైటీలకే పోయిన సంగతి ఏమిటో అధికారులకే తెలియాలని మహిళా సంఘాల సభ్యులు గుసగుసపెట్టుకుంటున్నారు. ఇందులో ఎవరి హస్తం ఉన్నదోనని గుర్రుగా ఉన్నారు.