ధాన్యం కొనని సర్కార్ పాపం.. రైతన్న పాలిట శాపమైంది. నెలరోజులు, నెల పదిహేను రోజులు, నలభైరోజులుగా ‘ధాన్యం కొనుండ్రి మొర్రో..కాల్మొక్తం’ అని అన్నదాతలు కాళ్లావేళ్లాపడ్డా ప్రభుత్వం కనికరించలేదు, కాలు కదుపలేదు. ‘నమస్తే తెలంగాణ’ ముందే హెచ్చరించినట్టుగా వానలు ముందే వచ్చాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, రోడ్ల మీద ఆరబోసిన ధాన్యంతో పాటు రైతులను నిండా ముంచాయి. పంట కొనుగోలుపై ప్రకటనలు ఇవ్వడం తప్ప వ్యవసాయ మంత్రి గానీ, సివిల్ సప్లయ్ మంత్రి గానీ కనీసం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన పాపాన పోలేదు. క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. ఆపత్కాలం దాపురించేదాకా పంటకొనే ప్రయత్నాలు చేయలేదు.
సెంటర్లలో కాంటా వేయక.. వేసినా మిల్లులకు తరలించేందుకు వాహనాలు లేక.. ధాన్యం ఎత్తేందుకు, దించేందుకు హమాలీలు లేక.. వర్షం వస్తే పంటను కాపాడుకొనేందుకు టార్పాలిన్లు లేక, కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు, నిలబడేందుకు నీడా దొరక్క అరిగోస పడ్డ రైతులు, చివరికి కండ్లముందే చెడగొట్టు వానలతో పంట కొట్టుకుపోయి గుండెలు బాదుకున్నారు. ముందుచూపు లేని, అసమర్థ ప్రభుత్వం ఇవ్వాళ రైతుల బతుకులను నీళ్లపాలు చేసింది. వారి భవిష్యత్తును కన్నీటిపాలు చేసింది.
80 శాతం ధాన్యం కొన్నామని గొప్పలు చెప్పుకొన్న ముఖ్యమంత్రి గారూ.. 80 శాతం ధాన్యం కొంటే.. మరి కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, చివరికి రోడ్లపై ఇప్పటికీ మిగిలి ఉన్నదేమిటో? గాలివానకు కొట్టుకుపోయిన ధాన్యమెక్కడిదో చెప్పగలరా?
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 27: ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం అన్నదాతలను నిండా ముంచింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షంతో ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి, మక్కజొన్నను అమ్ముకునేందుకు మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం వర్షార్పణమైంది. నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షానికి మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయ్యింది.
సీఎం ఇలాకా.. కోస్గి మండలంలో వాన దంచికొట్టింది. మండలంలోని చెన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం జలమయమైంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. కేంద్రాల్లోనే కుప్పలు తడవడంతో కంటతడి పెట్టారు. ధాన్యం కొట్టుకుపోవడం చూసి రోదించారు.
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. నెల రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడం, కాంటా పెట్టిన బస్తాలు తరలించకపోవడంతో వర్షానికి పూర్తిగా తడిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మార్కెట్ యార్డ్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు మండలాల్లో ధాన్యం తడవడంతో రైతులకు తీవ్ర నష్టం కలిగింది.

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మార్కెట్ యార్డులో వర్షానికి నీట మునిగిన ధాన్యాన్ని తీస్తున్న మహిళా రైతు

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం హస్నాపూర్‌లో భారీ వర్షం కురువడంతో ధాన్యం కుప్ప చుట్టూ చేరిన నీరు

సిద్దిపేట మార్కెట్ యార్డులో నీట మునిగిన ధాన్యాన్ని ఎత్తుతున్న నర్సాపూర్‌కు చెందిన రైతులు మంగవ్వ, కనకయ్య

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి నీటి మునిగిన ధాన్యం బస్తాలు

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వర్షానికి కొట్టుకుపోయిన వడ్లను ఎత్తుతున్న రైతు

మహబూబ్‌నగర్ మార్కెట్ యార్డులో వర్షానికి తడిసిన వడ్లను ఆరబోస్తున్న రైతు

సంగారెడ్డి జిల్లా కేంద్రం శివారులోని కుల్పగూర్లో వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులు

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగూలూర్లో వర్షానికి ప్లాస్టిక్ కవర్లు ఎగిరిపోయి తడిసిన ధాన్యం

వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం గట్టెపల్లిలో వర్షానికి నానడంతో మొలకలు వచ్చిన వడ్లు

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ధాన్యం బస్తాల మధ్య చేరిన నీటిని తొలగిస్తున్న రైతు