అలంపూర్ చౌరస్తా, జూలై 30 : కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు కలెక్టరేట్‌కు పాదయాత్ర చేపట్టారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని గురుకులం నుంచి జాతీయ రహదారి మీదుగా 60 మంది టెన్త్ విద్యార్థులు గద్వాల కలెక్టరేట్‌కు పాదయాత్రగా బయలుదేరారు. గురుకులంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని నినదిస్తూ 7 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. తహసీల్దార్, ఎస్సైని విద్యార్థుల వద్దకు పంపించారు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా విద్యార్థులు పొలాల వెంట, రహదారి పక్కకు దిగి తప్పించుకుంటూ ముందుకుసాగారు.
దీంతో సీఐ రవిబాబు, ఎస్సైలు శేఖర్, చంద్రకాంత్ సిబ్బందితో కలిసి ఇటిక్యాలపాడు స్టేజీ వద్దకు చేరుకొని రహదారికి అడ్డంగా నిల్చొని విద్యార్థులను అడ్డుకున్నారు. సమస్యలపై ఆరా తీశారు. సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్, అధికారులు కృషి చేస్తారని పాదయాత్ర విరమించాలని కోరారు. వినకపోవడంతో నడుచుకుంటూ వెళ్లొద్దని.. వాహనంలో తీసుకెళ్తామని నమ్మించి విద్యార్థులను డీసీఎం వాహనంలో ఎక్కించి పాఠశాలకు తిప్పి పంపించారు. అనంతరం సీఐతోపాటు తహసీల్దార్లు ప్రభాకర్, జ్యోషి పాఠశాలకు చేరుకుని విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. నిత్యం అన్నంలో పురుగులు వస్తున్నాయని, సరిపడా అన్నం అందుబాటులో ఉండటం లేదని, ఐదోతరగతి నుంచి ఇంటర్ వరకు 635మంది విద్యార్థులు చదువులు సాగిస్తున్నా.. పాఠశాలలో కనీస వసతులు లేవని వాపోయారు. ప్రధానంగా తాగునీరు, మరుగుదొడ్లు లేక ఇక్కట్లు పడుతున్నామని కన్నీరు పెట్టుకున్నారు. భవన యజమాని ధర్మారెడ్డి వసతులు కల్పించకుండా తమను కొడుతున్నాడని, ఉపాధ్యాయులు సైతం పట్టించుకోలేదని ఆరోపించారు. సీఐ రవిబాబు మాట్లాడుతూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.