Suryapet |కోదాడ రూరల్, జనవరి 13: ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతులు డబ్బులు నెల రోజులు గడుస్తున్నా రాకపోవడంతో పీఏసీఎస్ గోదాముకు తాళంవేసి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని తమ్మర గ్రామానికి చెందిన ఎనిమిది మంది రైతులు కోదాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్లో 631 బస్తాల ధాన్యం విక్రయించారు. ధాన్యం అమ్మి నెల రోజులైనా తమ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో సోమవారం తమ్మరలోని కోదాడ పీఏసీఎస్ గోదాముకు తాళంవేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజుల క్రితం ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన తమ ధాన్యం ప్రభుత్వానికి చేరిందా, లేక సొసైటీ వాళ్లు బయట అమ్ముకున్నారా అనేది తెలియడం లేదని చెప్పారు. సన్న వడ్లు అమ్ముకున్న మరికొంత మంది రైతులకు బోనస్ పడలేదని తెలిపారు. అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు సమయంలో సిబ్బంది ట్యాబ్‌లో నమోదు చేసే క్రమంలో జరిగిన తప్పిదంతో రైతులకు నగదు జమ కాలేదని పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, పండుగ సెలవుల అనంతరం సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు.