హనుమకొండ, జూన్ 2: ‘పేదలకు ఇండ్లు ఇయ్యలేదు.. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో మాకు న్యాయం చేయలేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ హనుమకొండలోని కళాక్షేత్రం వద్ద పేదలు నిరసన తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలోని న్యూశాయంపేటలో నిర్మించిన 608 ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఎంపిక చేసిన లబ్ధిదారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు.
మంత్రి పొంగులేటి వస్తున్నట్టు తెలుసుకున్న గోపాల్పూర్, జితేందర్‌నగర్ వాసులు కాళోజీ కళాక్షేత్రానికి చేరుకున్నారు. పాస్‌లు ఉన్నవారే లోనికి వెళ్లాలని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ఆందోళనకు దిగారు. అర్హులమైన తమకు ఇండ్లు ఎందుకు ఇవ్వరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్‌నగర్‌లో ఇండ్లు కేటాయించిన సందర్భంలో రాని వాళ్లకు న్యూ శాయంపేటలో కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు కూడా మోసం చేశారని మండిపడ్డారు. ఓ వైపు కాళోజీ కళాక్షేత్రం వెలుపల పేద ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా మరోవైపు లోపల మంత్రి పొంగులేటి లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై పలువురు మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలోని అంబేద్కర్‌నగర్, న్యూ శాయంపేటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారు. వివిధ కారణాలకుతోపాటు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నాడు పంపిణీ చేయలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది క్రితం అంబేద్కర్‌నగర్‌లో పంపిణీ చేయగా, రెండున్నరేండ్ల తర్వాత న్యూ శాయంపేటలోని ఇండ్ల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. నిజమైన పేదలను పకనపెట్టి, రాజకీయ సిఫార్సులు, ఇతర ప్రభావాలతో కొందరికి మాత్రమే ఇండ్లు కేటాయించారని బాధితులు ఆరోపిస్తున్నారు.
కాళోజీ కళాక్షేత్రంలో ఇండ్ల పంపిణీ కార్యక్రమం అనంతరం మంత్రి పొంగులేటి వెళ్తుండగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించలేని హనుమకొండకు చెందిన సూత్రపు కవిత మంత్రిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నప్పటికీ సదరు మహిళ.. వాహనంలో కూ ర్చున్న మంత్రి పొంగులేటి వద్దకు చేరుకొని తాను కాంగ్రెస్ నాయకురాలినని, తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడంలో అన్యాయం జరిగిందని వివరించారు. న్యా యం జరిగేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చి వెళ్లిపోయారు.