BJP Govt | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఎన్డీయే నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం రాష్ర్టాలను ఆర్థికంగా అస్థిరపరుస్తున్నది. న్యాయబద్ధంగా రాష్ర్టాలకు పంచాల్సిన పన్నుల (షేరబుల్ ట్యాక్స్‌లు) వాటాను క్రమంగా తగ్గిస్తూ.. నాన్-షేరబుల్ ట్యాక్సులుగా పిలిచే సెస్, సర్‌చార్జీలను అమాంతం పెంచేస్తున్నది. ఫలితంగా సామాన్యుల ముక్కుపిండి వసూలు చేస్తున్న రూ.లక్షల కోట్ల ట్యాక్సుల పైకాన్ని దొడ్డిదారిన కేంద్ర ఖజానాకు తరలించుకుపోతున్నది.
పేదలు, మధ్యతరగతి వర్గాల బతుకులను మారుస్తామంటూ ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు.. గడిచిన పదేండ్లలో అదనపు పన్నుల పేరిట సామాన్యులపై భారీగా సెస్, సర్‌చార్జీలను విధించింది. 2013-14లో రూ.1.08 లక్షల కోట్లుగా (స్థూల పన్ను రాబడి (గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ-జీటీఆర్)లో 6.53 శాతం) ఉన్న సెస్, సర్‌చార్జీలు.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.5.56 లక్షల కోట్లకు చేరుకోవచ్చని (జీటీఆర్లో 10.97 శాతం) తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల ద్వారా వెల్లడైంది. అంటే గడిచిన పదేండ్లలో రాష్ర్టాలకు పంచని పన్నుల వాటాను కేంద్రం ఏకంగా 5 రెట్లు పెంచినట్టు గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. ఇదే సమయంలో రాష్ర్టాలకు న్యాయంగా పంచాల్సిన పన్నుల వాటాను కేంద్రం అంతకంతకూ తగ్గిస్తున్నది. 2013-14లో జీటీఆర్లో రాష్ర్టాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటా 93.47 శాతంగా ఉంటే.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి దాన్ని 89.03 శాతానికి కుదించింది. ఈ మొత్తం పన్నుల్లో కేంద్రం కేవలం 41 శాతం నిధులను మాత్రమే రాష్ర్టాలకు విడుదల చేస్తున్నది. మిగతా 59 శాతం నిధులు కేంద్ర ఖజానాలో జమవుతాయి.
ప్రజలు వినియోగించే వస్తువులు, సేవలకు సాధారణంగా పన్నులను వసూలు చేస్తారు. అయితే ఈ అన్ని పన్నులకు అదనంగా కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా మరో పన్నును వసూలు చేస్తుంది. దీన్నే సెస్ అంటారు. దీన్ని పన్నుపై పన్ను అని కూడా అంటారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పెట్రోలియం, రహదారులు, మౌలిక సదుపాయాలు, ఎగుమతులు తదితర రంగాల్లో కేంద్రం సెస్ వసూలు చేస్తున్నది. సెస్సును ఏ రంగంలో వసూలు చేస్తే ఆ మొత్తాన్ని సదరు రంగం అభివృద్ధికే వెచ్చించాలి. ఇతర రంగాలకు బదిలీ చేయకూడదు. దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం సెస్సుల రూపంలో వసూలు చేస్తున్న నిధులన్నింటినీ పక్కదారి పట్టిస్తున్నది. ఉదాహరణకు.. పెట్రోల్, డీజిల్‌పై విధించిన సెస్‌తో చమురు పరిశ్రమలను, ఆ రంగాన్ని అభివృద్ధి చేయాల్సి ఉండగా అదేమాత్రమూ జరుగట్లేదు. 2020-21 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో సెస్సుల రూపంలో వసూలు చేసిన రూ. 2.19 లక్షల కోట్లు సంబంధిత రంగాల అభివృద్ధి కోసం కేంద్రం ఏమాత్రం ఖర్చు చేయలేదని కాగ్ నివేదిక కూడా తూర్పారబట్టింది.
కేంద్రం విధించే సెస్సుల్లో రాష్ర్టాలకు వాటా ఉండదు. ఆ సొమ్మంతా కేంద్ర ఖజానాకే చేరుతుంది. పన్నుల రూపంలో కేంద్రానికి వచ్చే రాబడిలోనే రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుం ది. ఈ నేపథ్యంలోనే రాష్ర్టాలకు నిధులు ఎగ్గొట్టేందుకు కేంద్రప్రభుత్వం క్రమంగా సెస్సులను పెంచుతున్నది. ఇక, కేంద్రానికి వచ్చే రాబడిలో రాష్ర్టాలకు పంచాల్సిన వాటాను కూడా కేంద్రం క్రమంగా తగ్గిస్తున్నది. 2016-2021 మధ్య పన్నుల్లో రాష్ర్టాలకు ఇవ్వాల్సిన వాటా 42 శాతంగా ఉండగా.. 2022 నుంచి 2026 వరకూ దీన్ని 41 శాతానికి కుదించింది.
పన్ను రాబడిలో రాష్ర్టాలకు పంచే వాటాలోనూ ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ర్టాలకు కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నది. 2013-14 నుంచి 2025-26 వరకూ చేసిన వాటాల పంపిణీ గణాంకాలను విశ్లేషిస్తే ఈ విషయం సులభంగా అర్థమవుతున్నది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం.. ఆరు ప్రమాణాలను బట్టి రాష్ర్టాలకు కేంద్రం నిధులను పంపిణీ చేస్తున్నది. రాష్ర్టాల విస్తీర్ణం (15 శాతం), జనాభా (15 శాతం), అత్యల్ప తలసరి ఆదాయం (45 శాతం), అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణ (10 శాతం), పన్ను వసూళ్లలో రాష్ర్టాల సామర్థ్యం (2.5 శాతం), జనాభా నియంత్రణలో రాష్ర్టాల పనితీరు (12.5 శాతం)ను బట్టి ఈ కేటాయింపులు చేస్తున్నారు. దీంతో జనాభా నియంత్రణను పాటించి, కేంద్రానికి అత్యధిక రాబడిని ఇస్తున్న దక్షిణాది రాష్ర్టాలకు న్యాయంగా రావాల్సిన నిధులు అందకుండా పోతున్నాయి.
రాష్ర్టాలకు వాటా ఇవ్వనవసరం లేని సెస్, సర్‌చార్జీలను గడిచిన పదేండ్లలో కేంద్రం అమాంతం పెంచేసింది. స్థూల పన్ను రాబడి (జీటీఆర్)లో సెస్, సర్‌చార్జీల వాటా 6.53 శాతం నుంచి 10.97 శాతానికి పెరిగింది. ఈ ధోరణి రాష్ర్టాలకు తీరని ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తున్నది.
– మాజీ మంత్రి హరీశ్‌రావు
1