e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home టాప్ స్టోరీస్ అగ్గికురుస్తున్నా.. జీవ నదుల్లా

అగ్గికురుస్తున్నా.. జీవ నదుల్లా

  • నిండు కుండల్లా కూడవెల్లి, హల్దీ
  • పొంగిపొర్లుతున్న చెక్‌డ్యామ్‌లు
  • నేటి రాత్రికే ఉప్పొంగే ఎగువ మానేరు
  • రేపోమాపో నిజాంసాగర్‌కు గోదారమ్మ
అగ్గికురుస్తున్నా.. జీవ నదుల్లా

కత్తుల శ్రీనివాస్‌రెడ్డి, సిద్దిపేట (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టుతో సిద్దిపేట, మెదక్‌ జిల్లాలో గోదారమ్మ పరుగులు పెడుతున్నది. మంటుటెండల్లో ఎండిపోయిన చెరువులు, చెక్‌డ్యాంలు ప్రస్తుతం గోదావరి జలాలతో నిండి అలుగులు పారుతున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కూక్‌ మండలం చేబర్తి వద్ద పుట్టిన కూడవెల్లి (కుడ్లేరు) వాగు, వర్గల్‌ మండలంలోని తున్కిఖల్సా తపాల్‌ ఖాన్‌ చెరువు వద్ద పుట్టిన హల్దీ వాగు ఇప్పుడు జీవ నదులను తలపిస్తున్నాయి. కూడవెల్లి వాగుపై మొత్తం 39 చెక్‌డ్యామ్‌లకు గాను 32 నిండాయి. ఇప్పటి వరకు కూడవెల్లి వాగు గుండా 1.7 టీఎంసీలు, హల్దీవాగు గుండా 1 టీఎంసీ జలాలు ప్రవహించినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. కూడవెల్లి వాగు గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కూక్‌, జగదేవ్‌పూర్‌, గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలోని ఎగువమానేరు వరకు ప్రవహిస్తుంది. గజ్వేల్‌ మండలంలో 5, కొండపాక మండలంలో 2, తొగుట మండలంలో 8, మిరుదొడ్డి మండలంలో 10, దుబ్బాక మండలంలో 5.. మొత్తం 30 చెక్‌డ్యామ్‌లు నిండాయి. కాగా, గజ్వేల్‌ కెనాల్‌ నుంచి కూడవెల్లి వాగుపైన ఉన్న 9 చెక్‌డ్యామ్‌ల్లో రెండు చెక్‌డ్యామ్‌లు నిండాయి. దుబ్బాక మండలం అక్కారం నుంచి రాజన్నసిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలోని ఎగువమానేరుకు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఆదివారం రాత్రికే ఎగువమానేరు పొంగి పొర్లనున్నట్లు అధికారులు తెలిపారు.

హల్దీపై నిండిన 24 చెక్‌డ్యామ్‌లు
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం వర్గల్‌ మండలంలోని తున్కిఖల్సా తపాల్‌ఖాన్‌ చెరువు వద్ద పుట్టిన హల్దీవాగు.. మండు వేసవిలోనూ జీవనదిని తలపిస్తున్నది. ఈ వాగుద్వారానే కాళేశ్వరం జలాలు సుమారు 96 కిలోమీటర్ల దూరంలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వెళ్లనున్నాయి. ఇందుకోసం కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సంగారెడ్డి కెనాల్‌ (6.25 కి.మీ) వద్ద ఉన్న ఓటీ ద్వారా సీఎం కేసీఆర్‌ ఈ నెల 6న నీటిని విడుదల చేశారు. తొలుత 500 క్యూసెక్కుల నీటిని వదిలిన అధికారులు, తర్వాత రోజుకు 1600 క్యూసెక్కుల చొప్పున పంపుతున్నారు. ఈ 12 రోజుల్లో సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌ మండలంలోని 4 పెద్ద చెరువులు, 9 చెక్‌డ్యామ్‌లను గోదావరి జలాలు నింపాయి. మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌ మండలంలోకి గోదావరి జలాలు కూడవెల్లి వాగు ద్వారా ప్రవేశించాయి. మెదక్‌ జిల్లాలో (శనివారం రాత్రి వరకు) 15 చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లాయి. మొత్తం 24 చెక్‌డ్యాంలు నిండాయి. దీనితో నర్సాపూర్‌ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని హకీంపేట వద్ద ఉన్న హల్ద్దీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ ఒక్క ప్రాజెక్టు కిందనే 2,900 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇది నిండడంతో దీంతో రైతులు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి సంబురాలు చేసుకుంటున్నారు. మరో నాలుగైదు రోజుల్లో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరుకుంటాయి.

నాలుగైదు రోజుల్లో నిజాంసాగర్‌కు
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు నాలుగైదు రోజుల్లో గోదావరి జలాలు చేరుకుంటాయి. ఇప్పటికే హల్దీవాగుపై నిర్మించిన 32 చెక్‌ డ్యామ్‌లకు గాను 24 నిండాయి. వీటిలో సిద్దిపేట జిల్లాలో 4 చెరువులు, 9 చెక్‌డ్యామ్‌లు, మెదక్‌ జిల్లాలో 15 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. హల్దీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. కూడవెల్లి వాగుపై మొత్తం 39 చెక్‌డ్యామ్‌లకు గాను కొడకండ్ల వద్ద నుంచి 30 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. ఇవి మొత్తం నిండాయి. గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల మీదుగా వెళ్తున్న కూడవెల్లి వాగుపై ఉన్న చెక్‌డ్యామ్‌లు నిండి గోదావరి నీళ్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎగువ మానేరుకు చేరుకున్నాయి. సోమవారం నాటికి ఎగువ మానేరు డ్యామ్‌ సర్‌ప్లస్‌ అవుతుంది. ఇప్పటివరకు కూడవెల్లి వాగు ద్వారా 1.7 టీఎంసీలు, హల్దీవాగు గుండా ఒక టీఎంసీ నీళ్లు ప్రవహించాయి.

  • హరిరాం, ఈఎన్సీ గజ్వేల్‌
Advertisement
అగ్గికురుస్తున్నా.. జీవ నదుల్లా
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement