హైదరాబాద్: ధరణి పోర్టల్‌ను (Dharani Portal) బంగాళాఖాతంలో పడేశాం. సరికొత్తగా భూ భారతి (Bhu Bharathi) చట్టాన్ని తీసుకొచ్చాం. ఇక రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం లభించినట్టేనని రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy) ఊదరగొట్టింది. అయితే వాస్తవంలో పరిస్థితి మరోలా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నెలల తరబడి ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా రైతులు, ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారమవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చిన భూ భారతి చట్టం, తమ పట్ల శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెలల తరబడి రెవెన్యూ ఆఫీసులు, కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరిగినా, చిన్న సమస్యలు కూడా పరిష్కరించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెక్షన్ విభాగంలో తహసీల్దార్ స్థాయిలో 25,601, ఆర్డీవో స్థాయిలో 5946, అదనపు కలెక్టర్ల స్థాయిలో 3650, కలెక్టర్ల లాగిన్లలో 7360 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. నిషేధిత భూములకు సంబంధించిన వివాదాలపై తహసీల్దార్ స్థాయిలో 8569, ఆర్డీవో స్థాయిలో 4001, అదనపు కలెక్టర్లు లాగిన్‌లో 7411, కలెక్టర్ల లాగిన్‌లో 4162 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు గుర్తించారు.
ఈ విధంగా కరెక్షన్ విభాగంలో 42,567, నిషేధిత భూముల విభాగంలో 24,143 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, చిన్న చిన్న తప్పులు సరిచేసేందుకు కూడా నెలల తరబడి తమను తిప్పించుకుంటున్నారని బాధితులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, రెవెన్యూ శాఖ మేలుకుని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.