కరీంనగర్ రూరల్, ఆక్టోబర్ 3: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.2 లక్షలలోపు రుణం ఉన్న రైతులకు మాఫీ చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రూ.2 లక్షల పైన ఉన్న వారికి దసరాలోపు మాఫీ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా గురువారం కరీంనగర్ రూరల్ మండలం తాహెర్ కొండాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అర్హత ఉండి ఎక్కడైనా రుణమాఫీ కాకపోతే అధికారులకు వివరాలు ఇవ్వాలని సూచించారు. డిజిటల్ కార్డు వివరాల నమోదులో ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.