మారుతీనగర్, సెప్టెంబర్ 19 : బతుకమ్మ, దసరా పండుగలకైనా జీతాలివ్వండి మహాప్రభో.. అంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లి సామాజిక ప్రభుత్వ దవాఖానలో పనిచేసే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది ప్రభుత్వాన్ని వేడుకున్నారు. శుక్రవారం మెట్పల్లి ప్రభుత్వ దవాఖాన ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. జీతాలు రాక ఇల్లు గడవడం కష్టంగా ఉందని, అప్పులు చేసి వెల్లదీస్తున్నామని ఆవేదన చెందారు. పండుగకు పిల్లలకు బట్టలు కొనలేని దుస్థితి ఉందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎనిమిది నెలల నుంచి జీతాలు రాకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వాధికారులు తమపై దయచూపాలని, పండుగ పూట జీతాలిప్పించి తమ కుటుంబాలను ఆదుకోవాలని వేడుకున్నారు.