హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల అవుట్సోర్సింగ్ నియామకాలను రద్దు చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ విధానంతో ఆర్టీసీ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉన్నదని మంగళవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు.
నిరుడు మాదిరిగానే ఖాళీ అయిన పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయాలని డిమాండ్చేశారు. కొత్త పద్ధతితో దళారీలు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. కొందరు దళారులు పోస్టులను అమ్ముకుంటున్నారని ఆరోపణలు వస్తుండడంతో ఆర్టీసీకి చెడ్డపేరు వస్తుందని తెలిపారు. అవుట్సోర్సింగ్ నియామక విధానాన్ని వెంటనే ఉపసంహరించుకొని ఆర్టీసీని రక్షించాలని వారు కోరారు.