హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పిలిచి సమస్యలను దసరా లోపు పరిష్కరించకపోతే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తరపున అభ్యర్థిని నిలబెట్టి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడిస్తామని రాష్ట్ర ఔట్సోర్సింగ్ జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య సర్కారును హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ప్రజాదర్భార్‌లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెన్నారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం పులి లక్ష్మయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులకు పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు దుర్గం శ్రీనివాస్, మహమ్మద్, శేఖర్‌రెడ్డి, బాలకృష్ణరెడ్డి, క్రాంతికుమార్, రాజేశ్, జగదీశ్, సురేశ్, జహీర్, నజీర్, విజయలక్ష్మి, జ్యోతి, సరిత, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
సోమిరెడ్డి కుటుంబానికి సాయం ; మృతుడి పిల్లల పేరున రూ.2 లక్షల ఎఫ్డీ
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కంప్యూటర్ ఆపరేటర్ ఏలేటి సోమిరెడ్డి కుటుంబానికి ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల అసోసియేషన్ ఆర్థిక సాయం అందజేసింది. మృతుడి పిల్లల పేరుతో రూ.2 లక్షలు ఫిక్స్‌డిపాజిట్లు చేసింది. ఆ బాండ్లను శుక్రవారం మృతుడి భార్య, పిల్లలకు అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తించే సోమిరెడ్డి.. ఈనెల 12న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆపరేటర్లసంఘం ప్రతినిధులు ముందు కు వచ్చి, బాధిత కుటుంబానికి భరోసాగా నిలిచారు.