కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 6 : సీఎం రేవంత్‌రెడ్డి వెలమ జాతిపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పద్మనాయక వెలమ సంఘం నాయకులు శుక్రవారం కరీంనగర్‌లోని పద్మనాయక ఫంక్షన్ హాల్ నుంచి తెలంగాణ చౌక్ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ తీశారు. ముఖ్యమంత్రి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని సంఘం అధ్యక్షుడు జువ్వాడి వేణుగోపాల్‌రావు, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్రావులు డిమాండ్ చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక జాతిని కించపర్చే విధంగా దూషణలు చేయడం సరికాదని హితవు పలికారు.
ఉమ్మడి రాష్ర్టానికి సీఎంగా వెంకట్రావు పనిచేశారని, అది తమ సత్తా అని గుర్తు చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి, సీఎంగా ఉండి కులాల పేరుతో తిట్టడం, జాతి మొత్తాన్ని కించపర్చేలా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గవర్నర్ స్పందించి ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలను ఇప్పటికీ వరకు కాంగ్రెస్ అగ్రనేతలు, అధిష్టానం ఖండించలేదంటే ఆ పార్టీ అభిప్రాయం కూడా అదేనా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లోని వెలమజాతి బిడ్డలు దీనిపై స్పందించాల్సిలని చెప్పారు.