హైదరాబాద్, జనవరి 14(నమస్తే తెలంగాణ) : ఎన్టీవీపై దాడులు, జర్నలిస్టుల అరెస్టు వివాదం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల అరెస్ట్ రాష్ట్రంలో సంచలనంగా మారడంతో నేరుగా కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగినట్టు, రాష్ట్ర నాయకత్వంపై పెద్దలు సీరియస్ అయినట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. ఇందుకు సంబంధించి పార్టీ, ప్రభుత్వ కీలకనేతలకు ఢిల్లీ నుంచి ఫోన్లు చేసి క్లాస్ తీసుకున్నట్టుగా చర్చ సాగుతున్నది. రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? జర్నలిస్టులు, మీడియాతో ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటూ అక్షింతలు వేసినట్టు సమాచారం. మీడియా ప్రతినిధుల అరెస్ట్ వరకు ఎందుకు వెళ్లినట్టు, పరిస్థితి అదుపుతప్పేంత దూరం ఎందుకు తీసుకెళ్లినట్టు నిలదీస్తూనే వివరాలతో కూడిన పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు తెలుస్తున్నది.
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పేరుగాంచిన మీడియా తన పని తాను చేసుకుంటుందని, దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చిందని అధిష్ఠానం పెద్దలు రాష్ట్రనేతలను ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. కాగా, జరిగిన పరిణామాలపై ముందే సమాచారం ఉండగా, ఓ ముఖ్యనేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ప్రభుత్వం అని చెబుతూ ఇలాంటి పనులేంటని, ‘మీడియాతో ఆటలా? ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారంటూ..’ గద్దించినట్టు గాంధీభవన్లో చర్చ జరుగుతున్నది. స్వార్థానికి పార్టీ, ప్రభుత్వాన్ని పణంగా పెడతారా అంటూ నిలదీస్తూనే ‘సొంత ఎజెండా ఏదైనా ఉంటే పార్టీ, ప్రభుత్వానికి నష్టం కాకుండా చూసుకోండి’ అని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం రెండేండ్లలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నదని, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. పథకాల అమలులో పూర్తిగా విఫలమై ఇప్పుడు అనుకూల మీడియాతో కూడా కక్ష సాధింపు చర్యలకు దిగితే భవిష్యత్లో జరిగే నష్టానికి బాధ్యులెవరని నిలదీసినట్టు తెలుస్తున్నది.
ఎన్టీవీలో ఓ మహిళా ఐఏఎస్ అధికారికి, మంత్రి కోమటిరెడ్డికి సంబంధించి వార్త ప్రసారం జరుగగా, స్వయంగా మంత్రి కోమటిరెడ్డి ప్రెస్మీట్ పెట్టి మరీ ఖండించిన విషయం తెలిసిందే. ఒకదశలో తీవ్ర భావోద్వేగానికి గురై ‘నాపై ఇంకా కోపం చల్లారకపోతే కాస్త విషమిచ్చి చంపండి..’ అంటూ మంత్రి వ్యాఖ్యానించడంతో వ్యవహారం కాస్త మలుపు తిరిగింది. దీనిపై అధిష్ఠానం పెద్దలు సైతం వాకబు చేసి, వివరాల ఆధారంగా పార్టీ, ప్రభుత్వ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. తమ దారికి రాని, మాట వినని మంత్రులు, నేతల వ్యక్తిత్వహననానికి పాల్పడటాన్ని అధిష్ఠానం పెద్దలు సైతం తీవ్రంగా ఆక్షేపించినట్టు సమాచారం. సంస్థాగతంగా పోరాడాలిగానీ వ్యక్తిత్వహననం ఎక్కడి సంస్కృతి అని ఇప్పటికైనా మానుకోవాలని హితవుపలికినట్టు వినికిడి.
ఐఏఎస్ అధికారుల ఒత్తిడితోనే ప్రభుత్వం ఎన్టీవీపై చర్యలకు ఆదేశించినట్టు కాంగ్రెస్పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఒక్క ఘటనతో మీడియా, జర్నలిస్టువర్గం మొత్తం పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందినట్టు సమాచారం. ఇది కాంగ్రెస్ సర్కారా లేక ఐఏఎస్ల ప్రభుత్వమా అని అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వివరించేందుకు పలువురు కీలకనేతలు అధిష్ఠానం పెద్దల అపాయింట్మెంట్ కోరి, నేడో రేపో ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వినికిడి.