హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): దవాఖానల్లో రాష్ట్రవ్యాప్తంగా అవుట్ పేషెంట్ (ఓపీ) కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో హైదరాబాద్‌లోని ప్రధాన దవాఖానలతోపాటు జిల్లా దవాఖానల్లో ఓపీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. జ్వరం, జలుబు, దగ్గు, విరేచనాలు, ఒళ్లు నొప్పులు సహా ఇతర ఆరోగ్య సమస్యలతో దవాఖానలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. గాంధీ దవాఖానలో జూన్‌లో ఓపీల సంఖ్య 56,113గా ఉండగా.. జూలైలో 62,058కి పెరిగింది. నిలోఫర్ పిల్లల దవాఖానాలో ఓపీల సంఖ్య ప్రతి నెల సగటున 900 వరకు ఉండగా.. జూలైలో అది 1,400గా నమోదైనట్టు దవాఖాన వర్గాలు తెలిపాయి. ఫీవర్ దవాఖానలో సైతం 500 వరకు నమోదయ్యే ఓపీ కేసుల సంఖ్య 750కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఓపీ కేసుల సంఖ్య దాదాపు 30 శాతానికి పైగా పెరిగినట్టు సమాచారం.
భారీగా పెరిగిన డెంగ్యూ కేసులు
రాష్ట్రంలో డెంగ్యూ కేసులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నాటికి 4,086 కేసులు నమోదయ్యాయి. కేవలం హైదరాబాద్‌లోనే 2,060 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా 243, మహబూబ్‌నగర్ 198, మహబూబాబాద్ 181, వరంగల్ జిల్లా 136 డెంగ్యూ కేసులతో రాష్ట్రవ్యాప్తంగా తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. ప్రజలు డెంగ్యూ బారినపడకుండా ఇండ్లలో తప్పనిసరిగా దోమతెరలు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలని చెప్తున్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, గుడ్‌నైట్, ఆలౌట్ వంటి వాటిని పడుకునే రెండు గంటల ముందు ఆన్ చేసుకుని, ఆఫ్ చేసిన రెండు గంటల తర్వాత గదిలోకి వెళ్లాలని సూచిస్తున్నారు. పిల్లలను బయటకు తీసుకెళ్లేటప్పుడు నిండుగా దుస్తులు వేయాలని సూచించారు. అధిక జర్వం, తలనొప్పి, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, శరీరంపై ఎర్రమచ్చలు, నీరసం, చికాకుగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్తున్నారు.
పెరిగిన టైఫాయిడ్, చికున్‌గున్యా కేసులు
డెంగ్యూ కేసులతోపాటు రాష్ట్రంలో చికున్‌గున్యా కేసులు సైతం పెరుగుతున్నాయి. జనవరి నుంచి ఆగస్టు నాటికి రాష్ట్రవ్యాప్తంగా 249 కేసులు నమోదయ్యాయి. నిరుడు ఇదే సమయానికి రాష్ట్రంలో 178 కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటివరకు 71 కేసులు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,856 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో 184 మలేరియా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ములుగు, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో కేసులు గత సంవత్సరంతో పోలిస్తే పెరిగాయి. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న వేళ కాచి వడపోసిన నీటినే తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే తినాలని, పండ్లు, కూ రగాయాలను శుభ్రమైన నీటిలో కడగాలని, పిల్లల చేతులు పరిశుభ్రంగా ఉండేలా చూ సుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.